దేశంలో వేగంగా జరుగుతున్న జాతీయ రహదారుల నిర్మాణం స్ఫూర్తిగా, ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు కూడా రోడ్లు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం “అడవి తల్లి బాట” పథకాన్ని ప్రారంభించింది. పీఎం జన్ మన్ పథకం, ఉపాధి హామీ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్‌లతో కలిపి రూ.1005 కోట్లతో ఈ ప్రాజెక్టు అమలు అవుతోంది. స్వాతంత్ర్యం తర్వాత రహదారి కూడా చూడని గిరిజన గ్రామాలను ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “గిరిజన గ్రామాల్లో నిర్మిస్తున్న ఈ రోడ్లు వారి జీవితాల్లో కొత్త వెలుగులు తెస్తాయి. ఎకో టూరిజాన్ని ప్రోత్సహించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం. అడవి తల్లి బాట పథకానికి వెంటనే రూ.50 కోట్ల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు” అన్నారు.
దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతంగా సాగుతోందని ఆయన తెలిపారు. 2014లో 91 వేల కిలోమీటర్ల రహదారులు ఉండగా, ఇప్పుడు 1,46,204 కిలోమీటర్లకు పెరిగాయని చెప్పారు. రోజుకు 34 కిలోమీటర్ల మేర కొత్త రహదారులు నిర్మిస్తున్నామని, గతంలో ఇది 11 కిలోమీటర్లే అని గుర్తుచేశారు.
గత ప్రభుత్వానికి కేంద్రం సహకారం అందించినా రోడ్ల అభివృద్ధి జరగలేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం రోడ్లతో పాటు పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పారు.
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే కూటమి ప్రభుత్వం కనీసం 15 సంవత్సరాలు కొనసాగాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. “కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే మనం కలిసే పరిష్కరించుకోవాలి. కూటమి బలంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాకెట్ వేగంతో ముందుకు దూసుకుపోతుంది” అని ఆయన అన్నారు.
జాతీయ రహదారుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
