నాయకుడంటే ఎలా వుండాలి.? ఇదిగో, ఇలా వుండాలి.! పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లలో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించి, దేశం దృష్టిని ఆకర్షించింది జనసేన పార్టీ. నిజానికి, ఇది చాలా పెద్ద విజయం. అయితే, 175 అసెంబ్లీ సీట్లతో పోల్చితే, 21 అనేది చాలా చిన్న నంబర్. ఆ విషయాన్ని ‘విజయోత్సాహంతో’ వున్న పార్టీ శ్రేణులకు అర్థమయ్యేలా చెప్పగలిగేవాడే అసలు సిసలు నాయకుడు. అందుకే, ఆయన పవన్ కళ్యాణ్ అయ్యారు.
‘మనం, సాధించాల్సింది చాలా వుంది. పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవాలి..’ అంటూ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్, విజయ గర్వంతో ఎవరూ హద్దులు దాటొద్దంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
పార్టీ నియమ నిబంధనలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ప్రతి ఒక్కరూ పని చేయాలన్న జనసేనాని పవన్ కళ్యాణ్, సొంత పార్టీ నాయకుల మీదనే విమర్శలు చేస్తూ, సోషల్ మీడియాలో వెకిలి కామెంట్లు పెడితే, అస్సలు ఊరుకునేది లేదని హెచ్చరించారు.
టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి నష్టం వాటిల్లేలా ఎవరూ ప్రవర్తించొద్దంటూ పార్టీ శ్రేణులకు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ‘151 సీట్లతో గెలిచి, అధికార పీఠమ్మీదున్న వ్యక్తికే భయపడలేదు.. అలాంటిది, సొంత పార్టీలో ఎవరైనా బెదిరింపులకు దిగితే ఊరుకుంటానా.?’ అంటూ జనసేనాని వ్యాఖ్యానించడం గమనార్హం.
కాగా, టీటీడీ ఛైర్మన్ పోస్ట్ కోసం 50 మంది వరకూ తనను సంప్రదించాననీ, కుటుంబ సభ్యులెవరూ తనను ఆ కోరిక కోరలేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అన్నట్టు, ‘వైసీపీ అంటే మనకు శతృవు కాదు, ప్రత్యర్థి మాత్రమే..’ అని పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
నిజమే మరి, రాజకీయాల్లో ప్రత్యర్థులుంటారు తప్ప, శతృవులు వుండకూడదు. ‘మనం వైసీపీని శతృవుగా చూడలేం. వాళ్ళు మనల్ని శతృవులని అనుకుంటారేమో.. అది నాకు తెలియదు..’ అని చెప్పారు జనసేనాని, పార్టీ ముఖ్య నేతల సమావేశంలో.
జనసేన నుంచి గెలిచిన ప్రజా ప్రతినిథులకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా జనసేనాని పై వ్యాఖ్యలు చేశారు.