వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. అన్న మాటకు కట్టుబడి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి స్నేహ హస్తం అందిస్తున్న వైనానికి తెలుగు తమ్ముళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. పొత్తుల చర్చలు ఇంకా అధికారికంగా ప్రారంభం కాకపోయినా, టీడీపీ అధినేత చంద్రబాబు కష్టకాలంలో వున్న దరిమిలా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు అండగా నిలుస్తున్నారు.
తాజాగా, చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో కలిసేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్న దరిమిలా, సోషల్ మీడియాలో ఇప్పటిదాకా జనసేన మీద అసహనంతో ఊగిపోయిన తెలుగు తమ్ముళ్ళలో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్ళూ పవన్ కళ్యాణ్‌ని అపార్థం చేసుకున్నామని పేర్కొంటూ, సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కూడా చెబుతున్నారు.
అంతే కాదు, జనసేనానికి స్వాగతం పలికేందుకు రాజమండ్రిలో తెలుగు తమ్ముళ్ళు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవడం గమనార్హం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగు తమ్ముళ్ళు రాజమండ్రికి తరలి వెళుతుండం ఇంకాస్త ఆసక్తికరమైన పరిణామం.
టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకున్నా, రెండు పార్టీల మధ్య ఓట్ షేరింగ్ కష్టమంటూ ఇప్పటిదాకా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ వచ్చారు. అయితే, ఓటు షేరింగ్ పక్కాగా జరుగుతుందని తాజా పరిణామాల్ని బట్టి అర్థమవుతోంది. టీడీపీ – జనసేన చెరిసగం కాదు, పరిస్థితుల్ని బట్టి తమకంటే జనసేన నాలుగైదు సీట్లు ఎక్కువ తీసుకున్నా సహకరిస్తామన్నది తెలుగు తమ్ముళ్ళ తాజా వాదనగా కనిపిస్తోంది.
‘చంద్రబాబు గనుక ఎన్నికల్లోపు జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోతే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన అధినేతకు మద్దతిస్తాం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు..’ అనే అభిప్రాయాలూ కొందరు టీడీపీ మద్దతుదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
అయితే, షరామామూలుగానే టీడీపీ మద్దతుదారుల్లో ఇంకో వర్గం మాత్రం, కొంత కులజాడ్యంతో వ్యవహరిస్తోంది. అది చాలా తక్కువ శాతమే అనుకోండి.. అది వేరే సంగతి. ఆ వర్గం కూడా, పవన్ కళ్యాణ్ ఇంతలా చంద్రబాబుకి అండగా నిలవడం ఆశ్చర్యకరమని అభిప్రాయపడుతుండడం గమనార్హం.
ఇదిలా వుంటే, జనసేన కార్యకర్తల్ని రాజమండ్రి విమానాశ్రయానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ స్థానిక జనసేన నేతలకు పోలీసులు నోటీసులు పంపుతున్నారు. జనసేనాని కోసం జనాన్ని తరలించడమా.? నవ్విపోదురుగాక.! స్వచ్ఛందంగా ఆయన కోసం జనం తరలివస్తారు. అయితే, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సంయమనం పాటించాలని పార్టీ శ్రేణులకు జనసేన నేతలే మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు.