మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య పెరుగుతున్న సంఘర్షణలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘హనుమాన్’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 100కు పైగా ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. వన్యప్రాణుల వల్ల పంటలు, పశుసంపద, ప్రజల ప్రాణాలకు ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో సమగ్ర సాంకేతిక, శాస్త్రీయ విధానంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు.

హనుమాన్ ప్రాజెక్ట్ (Healing and Nurturing Units for Monitoring, Aid and Nursing of Wildlife) ద్వారా వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల రక్షణకూ సమాన ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అటవీ సరిహద్దు గ్రామాల్లో ముందస్తు హెచ్చరికలు, వేగవంతమైన సహాయ చర్యలు, పరిహారం చెల్లింపులు వంటి వ్యవస్థలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్ట్ కింద 93 ర్యాపిడ్ రెస్పాన్స్ వాహనాలు, 7 ప్రత్యేక అంబులెన్స్ వాహనాలు సిద్ధం చేశారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైర్లుటిల్లో నాలుగు వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 19 ప్రత్యేక బృందాలు 24 గంటలూ సిద్ధంగా ఉంటాయి.
ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, గిరిజన సహాయకులు, పారా వెటరెనరీ సిబ్బంది ఉంటారు. గ్రామ స్థాయిలో ‘వజ్ర’ బృందాలను ఏర్పాటు చేసి పాములు, ఇతర జంతువుల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా శిక్షణ ఇస్తున్నారు. అవసరమైన రెస్క్యూ కిట్లు కూడా అందిస్తున్నారు.
మానవ-వన్యప్రాణి సంఘర్షణలో ప్రాణనష్టం జరిగితే ఇచ్చే పరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గాయపడిన వారికి 2 లక్షలు, పశువుల మరణానికి మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 2,107 కేసులు నమోదై, దాదాపు 4 కోట్ల రూపాయల పరిహారం చెల్లించినట్లు వెల్లడించారు.
చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగుల సమస్యను ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రభుత్వ సహకారంతో నాలుగు కుంకీ ఏనుగులను తీసుకువచ్చి ఇప్పటివరకు 8 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రజల ప్రాణాలు, పంటలను రక్షించడంలో ఇది కీలకంగా మారింది.
వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేందుకు ఏఐ టెక్నాలజీని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్, హనుమాన్ డిజిటల్ యాప్ ద్వారా ముందస్తు హెచ్చరికలు అందించే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు, ఫ్రంట్ లైన్ సిబ్బంది, ఎన్జీవోలు కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.
ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల భద్రతను పరిరక్షించడమే హనుమాన్ ఫౌండేషన్ లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. వసుధైక కుటుంబం భావనతో కలిసి జీవించే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.

