బీసీలు సమాజంలో బలహీన వర్గాలు కాదని, దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన మరియు బలమైన సామాజిక శక్తిగా నిలుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జనాభాలో 51 శాతం కంటే ఎక్కువ శాతం ఉన్నప్పటికీ రాజకీయంగా ఎందుకు పూర్తి స్థాయి సాధికారత సాధించలేకపోతున్నామనే అంశంపై బీసీ సంఘాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో సమావేశమైన పవన్ కళ్యాణ్, బీసీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ వర్గాల్లోని అన్ని ఉప కులాలు, సామాజిక వర్గాలు విభేదాలను పక్కనబెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీసీల్లో ఎవరికైనా ఉన్నత అవకాశాలు లేదా పదవులు దక్కితే అది మొత్తం సమాజానికి దక్కిన గౌరవంగా భావించే విశాల దృక్పథం రావాలని సూచించారు.
మనలో ఒకరు ఎదుగుతుంటే మిగతావారు ప్రోత్సహించాల్సిందిపోయి కిందకు లాగాలని చూడటం వల్లే బీసీలు రాజకీయంగా వెనుకబడుతున్నారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ముందుగా తమలోని లోపాలను సరిదిద్దుకుని, ఐక్యతతో ముందుకు సాగితేనే బలమైన రాజకీయ శక్తిగా ఎదగగలమన్నారు.
కేవలం నినాదాలతో కాకుండా ప్రతి ఉప కుల సంఘం చట్టబద్ధమైన తీర్మానాలతో ముందుకు రావాలని, సంఘాల వారీగా ఐక్యతను చాటాలని సూచించారు. అలా జరిగితేనే ఇతరుల చేతుల్లో పావులుగా మారకుండా స్వయంగా రాజకీయ హక్కులు సాధించగలమన్నారు. బీసీల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, దేశ ప్రధానమంత్రి కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తేనని గుర్తుచేశారు.
వృత్తి ఆధారిత కులాల్లో అసాధారణ నైపుణ్యం, కళాత్మకత దాగి ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. విశ్వకర్మల వంటి వర్గాల కళా నైపుణ్యం దేశ గర్వకారణమని కొనియాడారు. దేవాలయ నిర్మాణాలు, శిల్పకళ వంటి అద్భుతాలు ఆయా వర్గాల ప్రతిభ వల్లే సాధ్యమవుతున్నాయని చెప్పారు. జపాన్‌లో కుమ్మరి వృత్తికి ఇచ్చే గౌరవాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, మన దేశంలో కూడా అన్ని వృత్తి కులాలకు సమాన గౌరవం దక్కాలని ఆకాంక్షించారు.
బీసీ నాయకులు ఉన్నత రాజకీయ పదవుల్లోకి రావడం చూస్తే ఎంతో ఆనందిస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో బీసీలు ఓట్లుగా విడిపోవడం వల్లే అధికారానికి దూరమవుతున్నారని వ్యాఖ్యానించారు. రామ్ మనోహర్ లోహియా ఆలోచనలను ప్రస్తావిస్తూ, అన్ని బీసీ వర్గాలు ఏకతాటిపైకి వస్తే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. క్రమశిక్షణతో కూడిన వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగితే బీసీలు అన్ని రంగాల్లో అగ్రస్థానానికి చేరుకుంటారని తెలిపారు.

