అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించడం అత్యంత ఘోరమైన నేరమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాసనసభలో తీవ్రంగా ఖండించారు. ఇది భక్తుల విశ్వాసంపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, హిందూ ధర్మంపై జరిగిన కుట్రగా అభివర్ణించారు. తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేయడానికి ప్రణాళికాబద్ధంగా కుట్ర జరిగిందని, ఈ వ్యవహారానికి బాధ్యులైన వారందరికీ శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
ఈ కేసులో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికలో నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిసినట్లు వెల్లడైందని, సీబీఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తులో అయితే అసలు నెయ్యే లేకుండా పామ్ ఆయిల్, ఇతర రసాయనాలతో నకిలీ నెయ్యి తయారు చేసినట్లు తేలిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పాలు లేకుండా నెయ్యి తయారు చేయడం అనే అరాచకానికి గత పాలకులే మార్గం వేసారని విమర్శించారు. ఇది దేవాలయ ప్రసాదాన్ని అపవిత్రం చేయడమేనని అన్నారు.
టెండర్ నిబంధనలను ప్రణాళికాబద్ధంగా మార్చి, నచ్చిన సంస్థలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. కనీస వార్షిక టర్నోవర్ అర్హతను తగ్గించడం, పాలు సేకరణ నిబంధనలను తొలగించడం, డెయిరీ రంగ అనుభవాన్ని తగ్గించడం వంటి మార్పులు చేసి అర్హతలేని సంస్థలకు అవకాశం కల్పించారని సిట్ చార్జ్‌షీట్ ఆధారంగా వివరించారు. ఈ అక్రమాల వల్ల 2020 నుంచి 2023 మధ్య తిరుమల లడ్డూల తయారీలో నకిలీ నెయ్యి వినియోగమైందని చెప్పారు.
టీటీడీ రికార్డుల ప్రకారం 2019 నుంచి 2024 మధ్య కాలంలో కోట్లాది భక్తులు దర్శనానికి రాగా, కోట్ల సంఖ్యలో లడ్డూలు విక్రయమయ్యాయని, వాటిలో పెద్ద మొత్తంలో లడ్డూలు కల్తీ నెయ్యితో తయారైనట్లు సిట్ తేల్చిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆ లడ్డూల్లో కొంత భాగం అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా కూడా పంపిణీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఈ స్థాయిలో జరిగిన తప్పును చిన్న విషయం చేయాలని ప్రయత్నించడం మరింత అపచారమని వ్యాఖ్యానించారు.
హిందూ ధర్మంపై దాడి జరిగినప్పుడు భాష, కులం, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇతర మతాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తేవని, హిందూ ధర్మంపై జరిగితే తేలికగా తీసుకునే ధోరణి మారాలని అన్నారు. తిరుమలలో భగవంతుడి సొత్తును దోచుకునే వారికి తరతరాలుగా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కేసును ఆలస్యం చేస్తే దోషుల పాపం పెరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ కేసులో నిస్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు.
