ప్రతి మగాడి విజయం వెనకా ఒక ఆడది ఉంటుందంటారు. అది తల్లి రూపంలో అయినా సరే..భార్య రూపంలో అయినా సరే. మరే రూపంలో అయినా సరే. ఏ మనిషికైనా గట్టి సపోర్టింగ్ సిస్టం ఉంటే ఎన్ని కష్టాలైనా ధైర్యంగా ఎదుర్కోగలడు. ఎన్ని యుద్ధాలైనా చేయగలడు. నిలవగలడు. గెలవగలడు కూడా.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఆ మాట నూటికి నూరుపాళ్లు నిజమని ఎన్నోసార్లు రుజువైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అఖండ విజయం సాధించినప్పుడు పవన్ తల్లి అంజనా దేవి కళ్లలో సంతోషం, ఆమె స్పందించిన తీరు ఎంతోమందిని కదిలించింది. ఇకపై తాను గాజు గ్లాసులోనే టీ తాగుతాననడం కొడుకు పై ఆమెకున్న ప్రేమ. కొడుకు విజయం పట్ల ఎంత గర్వపడుతుందో చెప్పడానికి నిదర్శనం. పవన్ కూడా అంతే.
విజయం అనంతరం తొలిసారి చిరంజీవి నివాసానికి వెళ్లిన పవన్ కి తన కుటుంబం మెగా స్వాగతం పలికింది. ఆ సమయంలో పవన్ ప్రవర్తించిన తీరును చూసి ఎవ్వరైనా ముచ్చట పడాల్సిందే. తన తల్లికి నమస్కారం చేసే క్రమంలో ఆయన తన కాలికున్న చెప్పులు తీసి శిరస్సు వంచి పాదాభివందనం చేశారు. అంటే తన తల్లిని సాక్షాత్తు దైవంతో పోల్చుకున్నట్టే కదా..
ఇక పవన్ భార్య అనా లెజనోవా గురించి కూడా చాలా చెప్పుకోవాలి. ముచ్చటేస్తోంది మూడు రోజులుగా ఆమెను అలా చూస్తుంటే. పవన్ ఇంతటి ఘనవిజయం సాధించడంలో ఆమె పాత్ర కూడా ఎక్కువే. పవన్ 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని రాజకీయాల్లో యాక్టివ్ అయినప్పటి నుంచి ఆమె తన వంతు సహకారాన్ని అందిస్తూనే ఉన్నారు. పవన్ పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో ఒకానొక దశలో ఆమె తన పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లారు.
అయితే, దాన్ని అదునుగా తీసుకున్న కొందరు పవన్ పై బురద చల్లే ప్రయత్నం చేశారు. అనా తో పవన్ విడిపోతున్నారంటూ నెగిటివ్ ప్రచారం చేశారు. ఆ సమయంలో అనా ఎంట్రీ ఇచ్చి ట్రోలర్లకి గట్టి సమాధానమే ఇచ్చారు. ఇక ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఆమె పవన్ తోనే ఉన్నారు. నిన్నటికి నిన్న మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లిన పవన్.. తన తల్లికి పాదాభివందనం చేసే క్రమంలో తన కాలికున్న చెప్పులు విడిచారు. వెంటనే అనా ఆ చెప్పుల్ని తీసుకుని చేతిలో పట్టుకున్నారు. ఆమె అలా చేయడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు.
భర్తపై ఎంతో ప్రేమ బాధ్యత ఉంటే తప్ప అలా చేయలేరని చర్చించుకున్నారు కూడా. ఆ వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజమే అలాంటి భార్య తోడుగా ఉంటే భర్త ఎన్ని యుద్దాలైన చేసి గెలవగలడు.