మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలో చేసిన సేవతో పాటు, సామాజిక బాధ్యతతో చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా యూకే పార్లమెంట్ సభ్యులు అత్యున్నత పురస్కారం అందించారు. ఇటీవల లండన్ వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి యూకే పార్లమెంట్ సభ్యుల నుంచి జీవిత సాఫల్య పురస్కారంను అందుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిలో యూకే పార్లమెంట్ సభ్యుల నుంచి జీవిత పురస్కారం అందుకున్న ఏకైన నటుడు అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి యూకే పార్లమెంట్ సభ్యుల చేత జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. స్వశక్తితో చిత్ర రంగంలో ఎదిగి, నాలుగున్నర దశాబ్దాలుగా అలరించడం మాత్రమే కాకుండా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్న అన్నయ్య చిరంజీవి గారికి ఈ పురస్కారం దక్కడం సంతోషాన్ని కలిగించిందని పవన్ అన్నారు.
తాను ఎదగడం మాత్రమే కాకుండా ఎంతో మంది ఎదుగుదలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహాయం చేస్తూ, వారికి సహకారం అందిస్తూ ఎంతో మందిని ప్రోత్సహించారు. ఇటీవల ఆయన భారత దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. అన్నయ్య పద్మ విభూషణ్ చిరంజీవి గారు యూకే పార్లమెంట్ సభ్యుల జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం సంతోషాన్ని కలిగించింది. ఈ సందర్భంగా అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి పురస్కారాలు మరిన్ని అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.