అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని నిరంజన్ ఆరోగ్యం కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమాని ఆరోగ్యం కోసం అమ్మవారి ఆశీస్సులు కోరుతూ చేసిన ఈ పూజలు భక్తులు, అభిమానులను భావోద్వేగానికి గురి చేశాయి.
వరంగల్‌లోని ప్రముఖ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు. నిరంజన్ తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న కాల పూజా కార్యక్రమాల్లో పాల్గొని, వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.
నిరంజన్ ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన అమ్మవారి వెండి ప్రతిమను పవన్ కళ్యాణ్ ఆలయంలో సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆ ప్రతిమను నిరంజన్ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హారతులు ఇచ్చి వేదాశీర్వచనాలు అందించారు. భద్రకాళి అమ్మవారి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి కూడా పవన్ కళ్యాణ్ మొక్కులు చెల్లించారు.
పవన్ కళ్యాణ్ వరంగల్ పర్యటన సందర్భంగా హన్మకొండ, వరంగల్ ప్రాంతాల్లో జనసైనికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిరంజన్ నివాస ప్రాంతంతో పాటు భద్రకాళి ఆలయ పరిసరాలు అభిమానులతో కిక్కిరిశాయి. పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలుకుతూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రహదారి పొడవునా నిలబడి ఎదురుచూసిన అభిమానులకు ఆయన అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఈ సందర్భంగా తన వరంగల్ పర్యటన విజయవంతంగా సాగేందుకు సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ సీవీ ఆనంద్, వరంగల్ జిల్లా పోలీసు యంత్రాంగం, భద్రతా సిబ్బందికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భారీ సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలిపిన ప్రజలు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అభిమాని ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా పవన్ కళ్యాణ్ మరోసారి తన అభిమానుల పట్ల ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారని అభిమానులు పేర్కొంటున్నారు.
