ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ మరియు అటవీ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పలు శాఖల పురోగతిపై సమీక్ష చేయాలని తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులపై పవన్ కళ్యాణ్ వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణ పనులపై కూడా ముఖ్యమంత్రికి నివేదిక అందించారు. అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రెయిన్లు నిర్మిస్తే పారిశుధ్య నిర్వహణను పకడ్బందీగా అమలు చేయవచ్చని సూచించారు.
నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజ్ వ్యవస్థల్లో పూడిక తీత అంశాన్ని కూడా ఉప ముఖ్యమంత్రి ప్రస్తావించారు. వేసవి కాలంలోనే పూడిక తీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు వాటిని పూర్తి చేయాలని అధికారులకు సూచనలు ఇవ్వాలని కోరారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను కూడా ముఖ్యమంత్రికి వివరించారు.
రాష్ట్ర అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుధ్య వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై ఈ సమావేశంలో సమగ్ర చర్చ కొనసాగుతోంది. ప్రభుత్వం చేపడుతున్న పథకాల అమలు వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
