లక్షల మందిని పోగేసి, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభలు నిర్వహించి, సొంత డబ్బా కొట్టుకోవడం.. అనేది వైసీపీ హయాంలో చూశాం. కానీ, వెండితెరపై బాధ్యతాయుతమైన అభివృద్ధి సినిమా ఇప్పుడే చూస్తున్నాం.
టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది, ప్రజలతో మమేకమవడానికి. స్వతహాగా సినీ నటుడు కావడంతో, పవన్ కళ్యాణ్ వెండితెరపై ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లో ఇదో సరికొత్త సంచలనం.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఓ సినిమా థియేటర్‌లో, రావివలస గ్రామ ప్రజలు, లైవ్ ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో ముచ్చటించారు. కాదు కాదు, గ్రామంలో సమస్యలు తెలుసుకునేందుకు, పవన్ కళ్యాణ్.. వారితో ముచ్చటించారు. ప్రజా సమస్యల్ని తెలుసుకున్నారు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త ఆలోచనను అభినందించడం గమనార్హం.
రావివలస అంటే, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఎండల మల్లేశ్వరస్వామి కొలువై వున్న గ్రామం. నిజానికి, అది మారుమూల గ్రామం. కూటమి అధికారంలోకి వచ్చేవరకు సరైన రోడ్లు లేవక్కడ. ఈ మధ్యకాలంలోనే రోడ్లు బాగుపడ్డాయి. అదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో. చాలా సమస్యలున్నాయి రావివలస గ్రామంలో.
తమ సమస్యల్ని ఉప ముఖ్యమంత్రితో రావివలస గ్రామస్తులు చెప్పుకున్నారు. వాటి పరిష్కారం దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. దాదాపు 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ప్రకటించారు. ఈ మేరకు నిధుల మంజూరుకి ఆదేశాలు జారీ చేశారు.
వెండితెరపై తమ అభిమాన నటుడిని, ఉప ముఖ్యమంత్రి హోదాలో చూస్తూ, తమ సమస్యల్ని లైవ్ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం ఓ అద్భుతమైన అనుభూతి అని రావివలస గ్రామస్తులు చెబుతున్నారు.
