ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని విజ్జేశ్వరం ప్రాంతంలో పర్యటించి, విజ్జేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు ప్రతిపాదిత ఏటిగట్టు రోడ్డును పరిశీలించారు. మూడు మండలాల పరిధిలో సుమారు 33 కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్డు నిర్మాణ అవసరాన్ని ఇటీవల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి Kandula Durgesh ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
విజ్జేశ్వరం, పురుషోత్తపల్లి, పందలపర్రు, పెండ్యాల, ఉసురుమర్రు, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి, మల్లేశ్వరం, కడింపాడు, దొంగరావిపాలెం తదితర గ్రామాలను కలుపుతూ ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు చాలా కాలంగా కోరుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తైతే వేలాది మందికి రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు గ్రామాల మధ్య అనుసంధానం బలపడుతుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
అలాగే రాబోయే గోదావరి పుష్కరాల సమయంలో భక్తులకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని, వరదల సమయంలో గట్టు పర్యవేక్షణ కూడా సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రతిపాదిత మార్గాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు.
ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ రహదారి ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రి Nadendla Manohar కూడా పాల్గొన్నారు.
