పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో చాలామంది ప్రముఖులు ఎమ్మెల్యేలుగా పని చేశారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గమైన పిఠాపురం అభివృద్ధి కోసం గతంలో ఏ ఎంపీలు ఏం చేశారు.? అని తీస్తే, ‘గుండు సున్నా’ అని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు.. తమను ఏనాడూ ఉద్ధరించింది లేదన్నది వారి వాదన.
అయితే, అదంతా గతం.! ‘మా ఎమ్మెల్యే స్కూళ్ళను బాగు చేస్తున్నారు.. మా ఎమ్మెల్యే రోడ్లను బాగు చేస్తున్నారు..’ అని గర్వంగా చెప్పుకుంటున్నారిప్పుడు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు. ఇదంతా, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యమవుతోంది.
పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్, తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలూ కష్టపడుతున్నారు. ఓ వైపు తాను తీసుకున్న గ్రామీణాభివృద్ధి, అటవీ తదితర శాఖల వ్యవహారాల్ని రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటూనే, పిఠాపురం ఎమ్మెల్యేగా తన సొంత నియోజకవర్గానికి అదనపు సమయాన్ని కేటాయిస్తున్నారు.
దశాబ్దాలుగా పిఠాపురం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు, జస్ట్ నాలుగైదు నెలల్లోనే చాలావరకు పరిష్కారం చూపించగలిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా, ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాల సందర్భంగా, పిఠాపురం అభివృద్ధికి సంబంధించిన విషయాలపై చర్చలు జరుపుతున్నారు, అవసరమైన నిథుల కోసం ప్రయత్నిస్తున్నారు.
రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర్నుంచి, పిఠాపురం రైల్వే స్టేషన్‌లో ముఖ్యమైన రైళ్ళకు ‘స్టాప్స్’ వరకు.. జనసేన అధినేత పెడుతున్న స్పెషల్ ఫోకస్‌కి, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఫిదా అవుతున్నారు. తమది మోడల్ నియోజకవర్గంగా మారుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఓ వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకో వైపు జనసేన ఏకైక ఎమ్మెల్సీ హరిప్రసాద్, మరో వైపు కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్.. ఈ ముగ్గురూ పిఠాపురం అభివృద్ధి విషయంలో చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా, తక్కువ కాలంలోనే పిఠాపురం, రాష్ట్రంలోనే రోల్ మోడల్ నియోజకవర్గంగా మారబోతోందన్నది నిర్వివాదాంశం.