పాకిస్థాన్ మన భారతదేశం జోలికి వస్తే వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం అని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని.. అలాంటి వారిని అస్సలు క్షమించకూడదు అంటూ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియా ప్రశాంతంగా గడపలేదని.. పాకిస్థానే దీనికి ప్రధాన కారణం అంటూ దుయ్యబట్టారు. ఇన్ని రోజులు శాంతి శాంతి అంటూ కూర్చున్నాం. కానీ ఇక నుంచి పాక్ ఆటలు సాగవు. వారికి ప్రతిదాడి అంటూ ఎలా ఉంటుందో చూపించాలి’ అంటూ చెప్పారు పవన్ కల్యాణ్. ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా విజయవాడలో తిరంగా ర్యాలీ నిర్వహించగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ దాకా ఈ ర్యాలీ జరిగింది. అనంతరం పవన్ కల్యాణ్ “తిరంగా యాత్రకు మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు. ఇలాంటి సమయంలోనే మన ఐక్యత బయటపడుతుంది. పాకిస్థాన్ చేసిన గాయాలు ఇంకా మనం మర్చిపోలేదు. కసబ్ లాంటి తీవ్రవాదులు మన దేశంలోకి వచ్చి అరాచాకం సృష్టించారు. ముంబై పేలుళ్లు, హైదరాబాద్ లో దాడులు, జామా మసీదు పేలుళ్లు, లుంబనీపార్కు పేలుళ్లు చేసింది పాకిస్థాన్ ఉగ్రవాదులే.
కానీ ఒకప్పటి కంటే ఇప్పుడు మనం బలంగా ఉన్నాం. మన జోలికి వస్తే ప్రతిదాడులు చేయడం ఇప్పుడు మనం చూపిస్తున్నాం. గతంలో ఇలాంటివి లేవు. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఇక్కడ ఉన్నాం అంటే మన ఆర్మీనే కారణం. కాబట్టి మన సైన్యానికి మనం ఎప్పుడూ అండగా ఉండాలి. ఉత్తర రాష్ట్రాలు మనలాగా ప్రశాంతంగా ఉండవు. అక్కడ ఎప్పుడూ అలజడిగానే ఉంటుంది. కాబట్టి అందరూ ఒకే తాటిపై ఉండాలి. సెక్యులరిజం పేరుతో దేశాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించం. మనకు మురళీ నాయక్ లాంటి వారే కావాలి. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. అలాంటి వారే మనకు స్ఫూర్తి. మన దేశ ప్రధాని గారికి మనం ఎప్పుడూ అండగా ఉంటామని చెబుతున్నా’ అంటూ తెలిపారు.
