తమిళ మీడియాతో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఇదే కొత్త కాదు. గతంలోనూ మాట్లాడారు, ఇప్పుడు ఇంకోసారి మాట్లాడారు. అయినా, తమిళ మీడియాకి ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నట్లు.? తమిళ మీడియాకే కాదు, తెలుగు మీడియాకీ పవన్ కళ్యాణ్ అందుబాటులోనే వుంటున్నారు. నేషనల్ మీడియా కూడా పవన్ కళ్యాణ్‌ని పలు మార్లు ఇప్పటికే ఇంటర్వ్యూలు చెయ్యడం చూశాం.
అయినాసరే, పవన్ కళ్యాణ్ ఎప్పుడు తమిళ మీడియాతో మాట్లాడినా, అది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. సనాతన ధర్మం విషయంలో కావొచ్చు, హిందీ – తమిళ్ భాషల కొందరు సృష్టిస్తున్న రచ్చ గురించి కావొచ్చు, ఉత్తర – దక్షిణ భారత్.. అనే చర్చ గురించి కావొచ్చు, పవన్ కళ్యాణ్ తనదైన స్పష్టతతో తమిళ మీడియా ముందుకు వెళుతున్నారు.
హిందీని బలవంతంగా రుద్దితే, పోరాటంలో ముందుండేది తానేనని తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్.. అనేవి తెలుగునాట ఎప్పటినుంచో వున్నవేనని చెబుతున్న పవన్ కళ్యాణ్, తమిళనాడు ప్రజలు కూడా, తమిళంతోపాటు హిందీని అక్కున చేర్చుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు.
అలాగే, నార్త్ ఇండియన్స్ కూడా దక్షిణాదికి చెందిన ఏదో ఒక భాష పట్ల అవగాహన, ఆసక్తి పెంచుకుంటే మంచిదని పవన్ కళ్యాణ్ సూచించారు. వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవడం ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పారు పవన్ కళ్యాణ్.
తాను తమిళం నేర్చుకున్నాననీ, తన మీద ఎవరూ ఒత్తిడి చేసి తమిళం నేర్చుకునేలా చేయలేదన్నారు పవన్ కళ్యాణ్.
బలవంతంగా రుద్దడం అనేది సబబు కాదనీ, అలాంటి ప్రస్తావనే ఇప్పుడు లేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్ సందర్భంగా, దక్షిణాది రాష్ట్రాల్లో లోక్ సభ నియోజకవర్గాలు తగ్గే పరిస్థితి లేదన్న జనసేనాని, ఈ విషయమై పార్లమెంటులో చర్చోపచర్చలు జరగాల్సి వుందని వ్యాఖ్యానించారు.
చిన్న చిన్న విషయాల్ని బూతద్దంలో చూపించి, భయాందోళనలు సృష్టించడం సబబు కాదన్న జనసేనాని పవన్ కళ్యాణ్, చర్చల ద్వారా ఏ సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుందనీ, రాజకీయ కోణంలో ప్రాంతాలపైనా, భాషలపైనా ద్వేషం క్షమార్హం కాదని అన్నారు.
ఇక, తనకు డబ్బు అవసరమైనంత కాలం సినిమాలు చేస్తూనే వుంటాననీ, అలాగని తన నటనా జీవితం వల్ల, పదవీ బాధ్యతలకు ఎలాంటి ఇబ్బందీ రానివ్వబోనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
కాగా, పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ.. అందులోనూ తమిళంలో ఆయన మాట్లాడిన విధానం, లోక్ సభ సీట్లు సహా హిందీ, తమిళ వివాదంపై ఆయన అభిప్రాయాలు.. ఇవన్నీ తమిళనాట కూడా చర్చనీయాంశమవుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాయి.
తమిళనాడులోనూ జనసేన పార్టీని విస్తరించాలనే చర్చ, తమిళనాులో జరుగుతుండగా, ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేవీ లేవని ఇప్పటికే జనసేనాని స్పష్టతనిచ్చారు. ఇటీవల తమిళనాడులో పలు దేవాలయాల్ని జనసేనాని పవన్ కళ్యాణ్, తన కుమారుడితో కలిసి సందర్శించిన సంగతి తెలిసిందే.
అన్నట్టు, రాజకీయాల్లోకి ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.