సినీ నటుడు, పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సాయం చేయడంలో ముందుంటారు. విజయవాడ వరదల నేపథ్యంలో కనీ వినీ ఎరుగని రీతిలో కోట్లాది రూపాయల విరాళాన్ని అందించిన జనసేనాని పవన్ కళ్యాణ్, అదే సమయంలో తెలంగాణలో సంభవించిన వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికీ విరాళం అందించారు.
కష్టంతో ఎవరు తన వద్దకు వచ్చినా, వారిని ఆదుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సాయమంటే, ప్రభుత్వం తరఫున కాదు.. వ్యక్తిగతంగా సాయం అందించడం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకత.
తాజాగా, 50 లక్షల రూపాయల విరాళాన్ని ఎన్టీయార్ ట్రస్ట్‌కి ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్. తలసీమియా బాధితుల సహాయార్థం, ఎన్టీయార్ ట్రస్ట్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఏపీ సీఎం చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, తన తరఫున వ్యక్తిగతంగా ఎన్టీయార్ ట్రస్ట్‌కి 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ‘నందమూరి బాలకృష్ణ తనను బాలయ్యా అని పిలవమని అడుగుతుంటారనీ, అయితే తాను మాత్రం సార్ అనే అంటుంటానని’ చెప్పారు. మంచి పనులు చేస్తున్నప్పుడు, దానికి అడ్డు తగిలేవారుంటారనీ, ట్రస్ట్ నిర్వహించడం అంత తేలికైన విషయం కాదనీ, ఎన్టీయార్ ట్రస్ట్‌ని సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ అన్నారు.
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్ని కొద్దిరోజులుగా సందర్శించిన పవన్ కళ్యాణ్, నేరుగా విజయవాడ చేరుకుని, ఎన్టీయార్ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం.