ఓ వ్యక్తి రాజకీయ నాయకుడైతే.. ప్రజా ప్రతినిథి అయితే.. మరింత బాధ్యతగల మంత్రి పదవిలో వుంటే.. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోంటే.. ప్రజా ధనంతో సొంత పబ్లిసిటీ చేసుకోవడం కాదు, సొంత ఖర్చులతో ప్రజా సేవ కూడా చేయాలి.!
పవన్ కళ్యాణ్‌కి ముందు.. పవన్ కళ్యాణ్ తర్వాత.. అని రాజకీయాల గురించి ముందు ముందు జనం చర్చించుకుంటారేమో.! ఔను, జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఎన్నో సేవా కార్యక్రమాలు గతంలో చేశారు, చేస్తూనే వున్నారు.
పోటీ చేసిన రెండు చోట్లా 2019 ఎన్నికల్లో ఓటమి పాలైనా, కౌలు రైతుల కోసం స్వార్జితాన్ని వెచ్చించిన గొప్ప రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. ఇటీవలి ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించాక కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘సాయం’ అనే తన పాత బాటను వీడలేదు.
విజయవాడలో వరదల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని అందించారు. అలాగే, 400 గ్రామ పంచాయితీలకు లక్ష రూపాయల చొప్పున, మొత్తంగా నాలుగు కోట్ల రూపాయల సాయాన్ని అందించారు.
తాజాగా, ఓ స్కూలు ఆట స్థలం కోసం స్థలాన్ని తన స్వార్జితంతో కొనుగోలు చేసి ఇచ్చారు. అదీ ప్రభుత్వ స్కూలు కోసం. అధికారం చేతుల్లో వుంది కాబట్టి, ప్రజా ధనాన్ని వెచ్చించి చేస్తే, అందులో కిక్కేముంది.. అనుకున్నారో ఏమో.. స్వార్జితం 60 లక్షలు ఖర్చు చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్.
ఉప ముఖ్యమంత్రి హోదాలో రికార్డు స్థాయిలో గ్రామ సభలకు పిలుపునిచ్చి, రైల్వేకోడూరు నియోజకవర్గం మైసూరాపల్లిలో స్వయంగా ఓ గ్రామ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, అక్కడి స్కూలు విద్యార్థులు, తల్లిదండ్రులు కోరడంతో, స్కూలులో క్రీడా ప్రాంగణం ఏర్పాటు కోసం నడుం బిగించారు.
ఓ వైపు రాజకీయాలు, ఇంకో వైపు సినిమాలు.. ఇలా పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నది, సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగించడం కోసమే. రాజకీయమంటే కొందరికి వ్యాపారం. కానీ, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి మాత్రం, అదొక బాధ్యత.
ప్రజాధనంతో సొంత పబ్లిసిటీ చేసుకునే రాజకీయ నాయకుల్ని చూస్తున్నాం.. కానీ, పవన్ కళ్యాణ్ స్వార్జితాన్ని ఖర్చు చేస్తూ కూడా, పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నారు. చేసిన మంచి పనుల్ని చెప్పుకోవడానికి ప్రజాధనం దుర్వినియోగం చేయాల్సిన పనిలేదు. చేసింది మంచి పని అయితే, జనమే గొప్పగా చెప్పుకుంటారు.