తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించడం తీవ్ర విషాదం నింపింది. వైకుంఠ ఏకాదశి సమయంలో ఈ ఘటన తిరుపతి క్షేత్రంలో జరగడం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. ఇక ఇదే ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. తప్పు జరిగిందని మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్పారు. ఇక ఇదే విషయంపై మరోసారి ఆయన స్పందించారు. ఒక ఘటన జరిగినప్పుడు అందరికీ సమిష్టి బాధ్యత ఉంటుందని.. అందుకే తాను క్షమాపణలు చెప్పినట్టు పవన్ చెప్పారు. కేవలం తమకు మాత్రమే కాదని టీటీడీ బోర్డు కూడా దీనికి బాధ్యత వహించాలని పవన్ సూచించారు.
టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు, జేఈవో వెంకయ్య చౌదరి కూడా క్షమాపణలు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు అని ప్రశ్నించారు పవన్. సంక్రాంతి సంబరాల్లో ఉండాల్సిన ప్రజలు ఈ ఘటనతో బాధలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందరికంటే ముందే క్షమాపణలు చెప్పడం పవన్ వ్యక్తిత్వాన్ని సూచిస్తోందని ఆయన అభిమానులు అంటున్నారు. కానీ టీటీడీ బోర్డు సభ్యులు మాత్రం ఈ ఘటనపై ఇంకా క్షమాపణలు చెప్పకపోవడంపై పవన్ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.
భక్తులు, ప్రజల విషయంలో అత్యంత బాధ్యతగా వ్యవహరించినప్పుడు వారికి మన మీద నమ్మకం కలుగుతుందని పవన్ భావిస్తున్నారు.