‘మనం అందమైన అబద్ధంలో బతుకుతున్నాం. జీరో బడ్జెట్ రాజకీయం అంటే కుదరడంలేదిక్కడ. ఇంకో ఐదేళ్ళకో, పదేళ్ళకో అయినా మార్పు రావాలని ఆశిద్దాం. కార్యకర్తలకు భోజనాలైనా సరిగ్గా పెట్టాలి కదా. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అయినా ఖర్చు చేద్దాం..’ అని జనసేనాని తాజాగా చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి.
రాజకీయ పార్టీ అన్నాక ఖర్చు చేయాలి. పార్టీ పరంగా చేసే ఖర్చుకి అదనంగా, అభ్యర్థులూ ఖర్చు చేస్తుంటారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మొత్తానికంటే ఎన్నో రెట్లు అదనంగా ఎన్నికల్లో ఖర్చవుతోందన్నది బహిరంగ రహస్యం. ఈ విషయమై గతంలో పలువురు ప్రజా ప్రతినిథులే బహిరంగంగా నోరు జారి, నాలిక్కరచుకున్నారు.
అయితే, జనసేన పార్టీ మాత్రం నిఖార్సయిన రాజకీయాలు చేస్తూ వచ్చింది. జనసేన అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి మాత్రమే కాదు, అంతకన్నా చాలా తక్కువ.. చాలా చాలా తక్కువ ఖర్చు చేస్తూ వస్తున్నారు. కొందరైతే ఖర్చు విషయంలో మరీ పిసినారితనం ప్రదర్శిస్తూ వచ్చారు.
ఓటర్లు అవినీతిపరులైపోయాక, రాజకీయాల్లో నీతివంతమైన ఎన్నికలనేది అసాధ్యం. ఓటుకు ఐదు వేలు ఇస్తావా.? పది వేలు ఇస్తావా? అని బాహాటంగా ఓటర్లే రాజకీయ పార్టీల్ని నిలదీస్తున్న రోజులివి. ఒక్కో కార్యకర్తనీ వెంట తిప్పుకోవాలంటే రోజుకి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలదాకా సమర్పించుకోవాల్సిందే. రాజకీయ కూలీ అన్నమాట.
జనసేన పార్టీకి ఆ సమస్య లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులే జనసైనికులు, వాళ్ళే జనసేన కార్యకర్తలు. పార్టీ వీరి కోసం ఖర్చు చేయాల్సిన పనిలేదు. నాయకులూ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అయితే, ఇదిప్పుడు రాజకీయాల్లో వర్కవుట్ కావడంలేదు. అందుకే, కార్యకర్తల్ని బాగా చూసుకోండి, వారికి భోజనాలు అయినా పెట్టాలి కదా.? అని జనసేనాని సూచన చేశారు పార్టీ నేతలకు.
అంతే కాదు, ఎన్నికల్లో డబ్బు పంచాలా.? వద్దా.? అనేది నేను మాట్లాడకూడదు.. అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ వక్రీకరించడం మొదలు పెట్టిందనుకోండి.. అది వేరే సంగతి.
జీరో బడ్జెట్ రాజకీయాలు.. నేను అనను ఆ మాట.. అని జనసేనాని వ్యాఖ్యానించడం.. ఒకరకంగా చెప్పాలంటే, ఆయన వాస్తవ పరిస్థితుల్ని చాలా పద్దతిగా అర్థం చేసుకున్నారనే కదా.?