ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు కళకళ్ళాడుతున్నాయ్.. కేంద్రం ఇస్తున్న నిధులు, రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులు.. వెరసి, రోడ్లకు సరికొత్త కళ వచ్చింది. అంతకు ముందు వైసీపీ పాలనలో అన్నీ గుంతల రోడ్లే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రోడ్లకు మహర్దశ వచ్చిందన్నది నిర్వివాదాంశం.
గ్రామాల్లో రోడ్లు మాత్రమే కాదు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలూ శరవేగంగా జరుగుతున్నాయి. ఇదంతా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ ఫలితమే. ముఖ్యమంత్రి చంద్రబాబుకీ ఈ విషయంలో క్రెడిట్ ఇచ్చి తీరాలి. అయితే, డిప్యూటీ సీఎం.. అనే పదవికి సరికొత్త గౌరవాన్ని అద్దిన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి కదా.
తెలుగునాట ఉప ముఖ్యమంత్రి.. అనే పదవి కొత్తేమీ కాదు. కాకపోతే, గతంలో ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు, తమ తమ శాఖల కోసం ఏం చేశారు.? ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తాను తన శాఖల్ని ఎలా నిర్వహిస్తున్నారు.? అన్నది బేరీజు వేసుకుంటే, విషయం సుస్పష్టమవుతుంది.
ఇక, విశాఖ స్టీలు ప్లాంటు విషయానికొస్తే, స్టీలు ప్లాంటుని ప్రైవేటీకరించడానికి కేంద్రం గతంలో సమాయత్తమైంది. ‘అమ్మేయడం తప్ప ఇంకో మార్గం లేదు’ అని కేంద్రం పదే పదే చెప్పింది. కానీ, స్టీలు ప్లాంటు విషయమై జనసేనాని పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడ్డారు. ఈ విషయంలో టీడీపీ పాత్ర కూడా తక్కువేమీ కాదు.
కాకపోతే, పవన్ కళ్యాణ్ నిలబడిన తీరు వేరు. కేంద్రంతో పవన్ కళ్యాణ్ ఈ విషయమై సంప్రదింపులు జరిపిన వ్యవహార శైలి వేరు.
అధికారంలో లేనప్పుడూ, అధికారం చేతిలోకి వచ్చాకా.. పవన్ కళ్యాణ్, తన శక్తియుక్తుల్ని సమానంగానే, ఆ మాటకొస్తే అంతకు మించిన స్థాయిలో రాష్ట్రం కోసం వినియోగిస్తూ వచ్చారు.. అదే ఇప్పుడు రాష్ట్రానికి వరంగా మారింది.
మొన్నటి ఎన్నికల్లో బీజేపీ – టీడీపీ కలయిక విషయంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన జనసేన విషయమై, ప్రధాని నరేంద్ర మోడీకి పూర్తిస్థాయి అవగాహన వుంది. జనసేనాని శక్తియుక్తులపై పూర్తి నమ్మకమూ వుంది. అందుకే, పవన్ కళ్యాణ్‌కి అంతకు మించిన గౌరవం ఇస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా రాష్ట్రానికి కేంద్రం నుంచి మంచి జరుగుతోంటే, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఎందుకు వేరే ఆలోచనతో వుంటారు.? అంతిమంగా చంద్రబాబు అయినా రాష్ట్ర అభివృద్ధినే కోరుకుంటారు కదా.!
కానీ, టీడీపీలో కొందరికి మాత్రం, పవన్ కళ్యాణ్‌కి ఆయా విషయాల్లో ప్రత్యేక గుర్తింపు రావడం అస్సలు మింగుడుపడటంలేదు. వాళ్ళతోనే అసలు సమస్య. అయితే, అంతిమంగా అధినాయకత్వాల స్థాయిలో స్నేహాలు, గౌరవాలు, నిర్ణయాలు, కీలకమైన వ్యవహారాలు వుంటాయ్. వాటిని కిందిస్థాయిలో ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాల్సిందే.
నిజానికి, ఇప్పుడే అసలు కథ మొదలైంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి చాలా చాలా సాయం అందాల్సి వుంది. రాజధాని అమరావతి కావొచ్చు, పోలవరం ప్రాజెక్టు కావొచ్చు, రైల్వే జోన్ కావొచ్చు, జాతీయ స్థాయి విద్యా సంస్థలు.. వంటి వాటికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో టీడీపీ – జనసేన – బీజేపీ.. ఒక్కతాటిపైకి రావాల్సి వుంటుంది.
కేంద్రంలోని బీజేపీ అధినాయకత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న పవన్ కళ్యాణ్‌ని ముందు పెట్టి, రాష్ట్రానికి రావాల్సిన వాటి విషయంలో చంద్రబాబు తన అనుభవాన్నంతా ఉపయోగించాల్సి వుంటుంది. దానికి గండి కొట్టే పని టీడీపీ వైపు నుంచి సోషల్ మీడియాలో కావొచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావొచ్చు.. ఎవరూ చేయకపోతేనే మంచిది.!
పదిహేనేళ్ళు.. ఈ కూటమి ఇలాగే వుండాలని జనసేనాని ఆకాంక్షిస్తున్న దరిమిలా, టీడీపీలో ఎవరూ అభద్రతాభావానికి గురవ్వాల్సిన అవసరమే లేదు.