హీరోలంటే, తెరపై ఫైట్లు చేసేవాళ్ళు కాదు.. సినిమా హీరోగానే చెబుతున్నాను నేను.! నా దృష్టిలో నా తల్లి హీరో. నా తండ్రి హీరో. చదువు చెప్పే గురువు హీరో.! ఇదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విద్యార్థుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల సారాంశం. కడప జిల్లాలో జరిగిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, హీరోయిజం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థినీ విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసిన పవన్ కళ్యాణ్, స్కూళ్ళలో వసతుల కల్పన విషయమై రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నినదించాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.
ఇంట్లో తల్లి హీరో.. తండ్రి హీరో.! తమ పిల్లల్ని స్కూలుకు పంపే క్రమంలో ఉదయాన్నే లేచి, టిఫిన్ తయారు చేసి పిల్లలకు ప్రేమతో పెట్టే తల్లి హీరో. మధ్యాహ్నం భోజనం సిద్ధం చేసే తల్లి హీరో. అలాగే, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కష్టపడే తండ్రి కూడా ఓ హీరో.
తల్లిదండ్రులకు బరువు తగ్గించండి.. వారి కష్టాన్ని అర్థం చేసుకోండి.. పిల్లలుగా ఇదే మీ బాద్యత.. అని పవన్ కళ్యాణ్, విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హీరోలంటే సినిమాల్లోనే వుంటారనుకునేరు.. కానీ, అది నిజం కాదు. మీకు చదువు చెప్పే టీచర్ ఓ హీరో.
వ్యాయామంలో మెడల్స్ సాధించి పెట్టారు.. అలాంటి వాళ్ళని హీరోలుగా చూసుకోండి.. అంటూ, ఓ టీచర్‌ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించగా, సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది. ‘అమ్మా.. మీ గురించే చెబుతున్నా..’ అని, ఓ టీచర్‌ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నారు. దాంతో, ఆమె పట్టలేని ఆనందానికి గురయ్యారు.
వైసీపీ హయాంలో, విద్యార్థినీ విద్యార్థులతో మంత్రులుగా పని చేసినవారు, ముఖ్యమంత్రి పదవిలో వున్నవారు.. ఏం మాట్లాడేవారో చూశాం. రాజకీయ ప్రత్యర్థుల పెళ్ళిళ్ళు, భార్యలు, కార్లు.. అంటూ అత్యంత జుగుప్సాకరమైన మాటలు మాట్లాడేవారు.
కానీ, కూటమి హయాంలో.. అందునా, ఏపీ డిప్యూటీ సీఎం బహిరంగ సభల్లో.. స్ఫూర్తినిచ్చే ప్రసంగాల్ని చూస్తున్నాం.