కడప జిల్లాలో జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంలో విద్యార్థులతో ముచ్చటించిన పవన్ కళ్యాణ్, తల్లిదండ్రులే హీరోలనీ, గురువులూ హీరోలేననీ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోపక్క, కడప ప్రభుత్వ స్కూలుకి సంబంధించిన కిచెన్ అభివృద్ధి కోసం నిధుల లేమి విషయాన్ని అధికారులు తన దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.
మన స్కూలు.. మన కడప.. అని పేర్కొంటూ, ఆ స్కూలు కిచెన్‌కి సంబంధించి నవీకరణ నిమిత్తం, అవసరమైన మొత్తాన్ని తానే వ్యక్తిగతంగా సమకూర్చుతానని పవన్ కళ్యాణ్ చెప్పడం గమనార్హం.
విజయవాడ వరదల నేపథ్యంలో కోటి రూపాయల విరాళాన్ని వ్యక్తిగతంగా అందించిన పవన్ కళ్యాణ్, మరో నాలుగు కోట్ల రూపాయల నిధుల్ని (ఇదీ వ్యక్తిగత సాయమే) 400 గ్రామాలకు అందించిన విషయం విదితమే.
గతంలో రైల్వేకోడూరులో పర్యటన సందర్భంగా స్కూల్ విద్యార్థుల ఆటస్థలం నిమిత్తం, సుమారు 60 లక్షలు వ్యక్తిగత ఆర్జన నుంచి వెచ్చించి కొనుగోలు చేసి, పాఠశాలకు అప్పగించిన విషయం విదితమే.
ఇక, కడప అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా వున్న వైఎస్ జగన్, గతంలో కడప ఎంపీగానూ పని చేశారు. ప్రస్తుత కడప ఎంపీ కూడా వైసీపీ నాయకుడు అవినాష్ రెడ్డి.. పైగా, ఆయన స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోదరుడు.
అయినాగానీ, కడప స్కూలులో కిచెన్ సరిగ్గా లేకపోవడమంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? నాడు – నేడు పేరుతో వైసీపీ హయాంలో పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే జరిగాయనడానికి, పవన్ కళ్యాణ ్ ప్రస్తావించిన స్కూలు కిచెన్ దుస్థితే అందుకు నిదర్శనం.