వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు సంబంధించి దేశంలో తొలి 10 రాష్ట్రాల జాబితాలో ఏపీ ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్బీ) ఈ గణాంకాలు చెబుతున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం మౌనంగా, ఉదాశీనంగా ఉండటం మహిళలకు శాపమని అన్నారు. ఉత్తరాంధ్రలోని అచ్యుతాపురం సెజ్‌లో ఉపాధి నిమిత్తం వచ్చిన ఓ మహిళపై.. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ వద్ద ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న మరో గిరిజన మహిళపై జరిగిన అత్యాచారం, హత్యలు తనను కలచివేశాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉదాసీనతతోనే మృగాళ్లు రెచ్చిపోతున్నారని పవన్ ఆరోపించారు. సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో యువతిపై జరిగిన అత్యాచారం ఘటనలో ఏడాది దాటినా నిందితుడిని పట్టుకోలేకపోవడం రాష్ట్ర పోలీసు శాఖ అసమర్థతకు నిదర్శనమని ఆరోపించారు. హోం శాఖ మంత్రి వ్యాఖ్యలు కూడా నేరాల పెరుగుదలకు కారణమని ఆరోపించారు.
మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు? – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/S6L0tNnYOd
— JanaSena Party (@JanaSenaParty) September 19, 2022