‘అజ్ఞాతవాసి’ తర్వాత మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కన్పించలేదు. ఇకపై కనిపించే అవకాశాలు కూడా చాలా తక్కువేనని పవన్ కళ్యాణ్ అభిమానులు మానసికంగా ఫిక్సయిపోయారు. పవన్ కళ్యాణ్‌ని సినిమా హీరోలా కంటే, రాజకీయ నాయకుడిలానే చూడాలన్నది వారి ఆలోచన. ‘మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో చేస్తే బావుంటుంది..’ అనే భావన కొందరిలో వుండొచ్చుగాక.. కానీ, సినిమాలతో పోల్చితే రాజకీయాల్లోనే పవన్ కళ్యాణ్‌కి ‘పవర్’ ఎక్కువనే అభిప్రాయం చాలామంది జనసైనికుల్లో వుంది.
ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓడిపోయినా, తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ‘ఇంపాక్ట్’ చాలా ఎక్కువేనని జనసైనికులు విశ్వసిస్తున్నారు. ‘దేనికైనా టైమ్ కలిసి రావాలి.. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఆలోచన చేసే రోజొస్తుంది.. అప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ ప్రత్యామ్నాయంగా మారతారు..’ అన్నది జనసైనికులనబడే పవన్ కళ్యాణ్ అభిమానుల వాదన. ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్‌తో సినిమా కోసం పలువురు దర్శకులు లైన్‌లో వున్నారంటూ ప్రచారం జరుగుతోంది సినీ వర్గాల్లో.
Also Read: పవన్ కోసం క్యూ లో.. ముగ్గురు దర్శకులు !!
నిజానికి ఈ ప్రచారం ఇప్పుడు కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. చాలాకాలంగా జరుగుతున్నదే. సంపత్ నంది నుంచి హరీష్ శంకర్ దాకా.. ఎందరో దర్శకులు లైన్‌లో వున్నారు. పవన్ కళ్యాణ్ ‘ఓకే’ చెప్పాలేగానీ, ఆయనతో సినిమా ఛాన్స్ వదులుకునే దర్శకుడు ఎవరైనా వుంటారా.? నిర్మాతల సంగతి సరే సరి. డజను మంది నిర్మాతలు పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘మాకోసం పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా అయినా చేస్తే బావుంటుంది..’ అని కోరుకునేవాళ్ళే వీళ్ళంతా. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాల విషయమై ఖచ్చితమైన అభిప్రాయంతో వున్నారట.
‘ఇప్పట్లో సినిమాల గురించి ఆలోచించలేను. నా ముందు చాలా బాధ్యత వుంది. ఒకే ఒక్క సీటుని జనసేన సాధించగలిగినా, ప్రజలు మన మీద పెద్ద బాధ్యతనే పెట్టినట్లు భావించాలి. సినిమాల్లోకి వెళ్ళడం ద్వారా ఆ బాధ్యతను విస్మరించినట్లవుతుంది. పైగా, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా చేయాల్సిన పనులు చాలా వున్నాయి..’ అని పవన్ కళ్యాణ్, ఇప్పటికే పార్టీ నేతలకు స్పష్టతనిచ్చారు. సినిమాల్లో నటించడంలేదంటూ పవన్ కళ్యాణ్ తరఫున జనసేన పార్టీ ఒకటికి పదిసార్లు క్లారిటీ ఇస్తూనే వుంది.
కానీ, పవన్ కళ్యాణ్ మీద సినీ గాసిప్స్ వస్తూనే వున్నాయి. అది సినీ రంగంలో పవన్ కళ్యాణ్‌కి వున్న క్రేజ్‌కి నిదర్శనంగా మాత్రమే చూడాలి తప్ప.. అందులో నిజం లేదు. పొలిటికల్ షెడ్యూల్ చూసుకుంటే, ఇంకో ఏడాది వరకూ పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా గడపబోతున్నారట. సో, ఇప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే అవకాశమే లేదన్నమాట.
