మన దేశంలో చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఈ ఏడాది నటుడు మిథున్ చక్రవర్తికి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఆయనకు చాలా మంది సినీ సెల్రబిటీలు ప్రశంసలు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ కూడా విషెస్ తెలిపారు. మిత్రుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ అవార్డును ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. హిందీ, బెంగాలీ సినిమాల్లో ఆయన తనదైన ముద్ర వేశాడు. మిథున్ చక్రవర్తితో నాకు ఎంతో అనుబంధం ఉంది. నేను నటించిన ‘డిస్కో కింగ్’ సినిమాకు చక్రవర్తి హిందీ సినిమా ‘డిస్కో డాన్సర్’ ఆధారం. అలా మా ఇద్దరికీ చిత్రబంధం ఉంది అంటూ ఎమోషనల్ అయ్యాడు బాలయ్య.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా మిథున్ చక్రవర్తికి అభినందనలు తెలిపారు. ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డుకు ఎంపికైన మిథున్ చక్రవర్తికి నా హృదయపూర్వక శుభాభినందనలు. ఆయనకు ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా ఆనందనీయం. 80వ దశకంలో దేశవ్యాప్తంగా యూత్ ను ఆయన ప్రభావితం చేశారు. అప్పట్లో అమితాబ్ బచ్చన్ తర్వాత అంతటి స్థాయిలో మిథున్ చక్రవర్తి పేరు సంపాదించుకున్నారు. ఇక సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఆయన రాణించారు. మొదట టీఎంసీలో, ఆ తర్వాత బీజేపీలో చేరారు.
చాలా ఏండ్లుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ఆయన ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ఇప్పటి తరం నటులకు, రాజకీయ నేతలకు ఆయన ఎంతో ఆదర్శం అనే చెప్పుకోవాలి. మిథున్ చక్రవర్తికి సంపూర్ణ సంతోషాన్ని, ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాన్ స్పెషల్ నోట్ ను విడుదల చేశారు. వీరే కాకుండా టాలీవుడ్ నుంచి ఇంకా చాలా మంది అభినందనలు తెలుపుతున్నారు.