కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ఆ నియోజకవర్గ వై.సి.పి మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం లేపింది. ఈ వ్యాఖ్యలపై పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు.
మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు అనవసరం – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్:
కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిపై ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించతగ్గవి. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ మాట్లాడటం వైసీపీకి అలవాటైపోయింది. వారి మాటల దూకుడుకు సభ్య సమాజం సిగ్గుపడే స్థితి వచ్చింది. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకొని అసభ్యంగా మాట్లాడడం ఓ నీచపు పంథా. శాసనసభలోనూ అదే రీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నాయకులకు ప్రజలు ఒకసారి బుద్ధి చెప్పారు. అయినప్పటికీ ఇలాంటి మాటలు వదలడం లేదు. మహిళలు ఈసారి మరింత బలంగా స్పందిస్తారు. బాధ్యత గల పదవిలో ఉన్నవారు ఈ స్థాయి మాటలు మాట్లాడటం ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ.
వైసీపీకి మహిళలపై ద్వేషభావమేనా? – మంత్రి నారా లోకేష్:
మహిళా ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని నిందిస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం దారుణం. ఇది నేరం. ఇటువంటి మాటలు చెప్పేవారికి కనీస ఇంగితజ్ఞానం లేదనిపిస్తోంది. తల్లి, చెల్లిని తన రాజకీయ ప్రయోజనాల కోసం తూర్పారబోయిన జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటే ఎలా? ఇది ఆయన జంగిల్ రాజ్ కాదు. మహిళల గౌరవాన్ని కాపాడే ప్రజాప్రభుత్వం ఉంది. ఎవరు ఉన్నా, ఎక్కడ ఉన్నా… ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు.
ఇలాంటి వ్యాఖ్యలతో స్త్రీల గౌరవాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తే… ప్రజలు మళ్లీ అదే భద్రత కోసం గట్టిగా తిరిగి సమాధానం చెబుతారని నేతలు హెచ్చరించారు.
