సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి పీఎస్ ముందు నిరసనకు దిగారు. స్థానిక టీడీపీ నేత జగ్గును అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్టు చేయడంతో వీరు నిరసనకు దిగారు. వైసీపీకి చెందిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిపై జగ్గు వ్యాఖ్యలు చేశారంటూ అరెస్టు చేయడంతో వీరు స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆమె మండిపడ్డారు. పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తారా..? రండి తేల్చుకుందాం.. అని వైసీపీ నేతలకు పరిటాల సునీత సవాల్ విసిరారు. జగ్గును విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. స్టేషన్ కు టీడీపీ కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో చేరుకుని బైఠాయించడంతో భారీగా పోలీసులు బలగాలు చేరుకున్నాయి.