అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో, ‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన కొత్త సినిమా పరదా ట్రైలర్‌ని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో రామ్ మాట్లాడుతూ, “పరదా కథ చాలా అద్భుతంగా ఉంది. బాలీవుడ్‌లో కనిపించే లాపతా లేడీస్ లాంటి కంటెంట్ మన దగ్గర రావడం ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలు ప్రోత్సహించాలి. అనుపమ తన పాత్రకు 100% కృషి చేసింది” అని చెప్పారు.
ఈ సినిమా కథ సుబ్బు (అనుపమ) చుట్టూ తిరుగుతుంది. పురుషాధిక్యపు సంప్రదాయాలు ఉన్న తన ఊరిని వదిలి, ఇద్దరు అపరిచితులతో రోడ్ ట్రిప్‌కి వెళ్తుంది. మధ్యలో సీరియస్ మలుపు తిరిగే ఈ కథలో సుబ్బు అదృశ్యం కావడంతో ఊరిలో కలకలం రేగుతుంది. హిమాలయాల అందాలు, పల్లెజీవిత వాస్తవాలు మిళితమైన విజువల్స్‌ను మృదుల్ సుజిత్ సేన్ చూపించగా, గోపీ సుందర్ సంగీతం సినిమాకి ఇంటెన్సిటీని పెంచింది.
అనుపమ తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచిందని దర్శకుడు, నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రాన్ని ఆనంద మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ కలిసి నిర్మించారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మేకర్స్ రాజ్–డికె కూడా ఈ ప్రాజెక్ట్‌కు మద్దతు ఇస్తున్నారు.
పరదా ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
