ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు బహిరంగ లేఖ ద్వారా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలు ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు సమాధానంగా పల్లా పలు వాస్తవాలను వివరించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలు, సీట్ల కేటాయింపులు, పీపీపీ విధానం వంటి అంశాలపై జగన్ పాలనలో తీసుకున్న నిర్ణయాలను పల్లా గుర్తు చేశారు.
“ప్రస్తుత వైసీపీ నేతలు పీపీపీ విధానం పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ నిజం ఏమిటంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లు ప్రైవేట్ కోటాకు కేటాయించినది జగన్ ప్రభుత్వమే” అని పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం, జీ.ఓ. నంబర్లు 107, 108, 133లను విడుదల చేసి ప్రైవేట్ కోటా సీట్లను ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు.
అలాగే రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలకు జగన్ ప్రభుత్వం రాష్ట్ర నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని పల్లా పేర్కొన్నారు. నిర్మాణాలకు ఖర్చయిన రూ.1550 కోట్లు మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులేనని చెప్పారు. నాలుగేళ్ల జగన్ పాలనలో 18 శాతం మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయని, ఈ రేటుతో ముందుకు సాగితే 17 కాలేజీలు పూర్తి కావడానికి 15 ఏళ్లు పడుతుందని వివరించారు.
జగన్ ప్రభుత్వ విధానం వల్ల 1750 మెడికల్ సీట్లు మరియు అనేక పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని పల్లా హెచ్చరించారు. కానీ పీపీపీ విధానం అమలులోకి వస్తే ప్రభుత్వ కోటాలో 110 సీట్లు, ప్రైవేట్ కోటాలో మరో 110 సీట్లు పెరిగి మొత్తం 220 సీట్లు విద్యార్థులకు అదనంగా లభిస్తాయని చెప్పారు. పీపీపీ పద్ధతిలో కూడా ఇప్పటిలాగే 50 శాతం సీట్లు ప్రభుత్వ కోటాలోనే భర్తీ అవుతాయని, ప్రభుత్వ ఫీజులు మాత్రమే వర్తిస్తాయని వివరించారు.
రాబోయే రెండేళ్లలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి అవుతాయని, విద్యార్థులు త్వరగా లాభపడతారని పల్లా చెప్పారు. కర్నాటకలో ఇప్పటికే 12 కాలేజీలు పీపీపీ విధానంలో నిర్మాణంలో ఉన్నాయని, ఇతర రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు.
జగన్ పాలనలో గంగవరం పోర్ట్, విశాఖ స్టీల్ భూములు ప్రైవేటుకు అమ్మేసినదీ జగన్ ప్రభుత్వమేనని పల్లా ఆరోపించారు. “జగన్ విధ్వంస పాలన వల్ల నిధుల కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం నిధులు మెడికల్ కాలేజీలకే ఖర్చు చేస్తే సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలు, రోడ్లు అన్నీ దెబ్బతింటాయి. ఇది జగన్ రాజకీయ కుట్ర” అని పల్లా లేఖలో పేర్కొన్నారు.
చంద్రబాబు పాలనలో జిల్లాకొక మెడికల్ కాలేజీ, రెవిన్యూ డివిజన్‌కొక ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసినందునే నేడు రాష్ట్రంలో డాక్టర్ల కొరత లేకుండా ఉందని పల్లా చెప్పారు. “ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి నలుగురు ఎన్.ఆర్.ఐల్లో ఒకరు తెలుగువారిగా ఉన్నారంటే, అది చంద్రబాబు తీసుకున్న దూరదృష్టి నిర్ణయాల ఫలితం” అన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 18 ప్రభుత్వ, 18 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయంటే అది చంద్రబాబు హైబ్రిడ్ విధానానికి ఫలితమని పేర్కొన్నారు. చైనా, వియత్నాం వంటి దేశాలు హైబ్రిడ్ విధానం వల్ల అభివృద్ధి చెందగా, క్యూబా, ఉత్తర కొరియా వంటి దేశాలు పిడివాదం వల్ల వెనకబడ్డాయని ఆయన ఉదాహరణ ఇచ్చారు.
పల్లా శ్రీనివాసరావు తన లేఖలో— “మెడికల్ కాలేజీల పేరుతో జగన్ చేస్తున్నది ప్రజల ప్రయోజనాల కోసం కాదు, రాజకీయ స్వార్థ ప్రయోజనాలకోసమే” అని విమర్శించారు. నీతి ఆయోగ్ రిపోర్టు ప్రకారం 2014–19లో చంద్రబాబు పాలనలో ఏపీ ఆరోగ్య రంగం 4వ స్థానంలో ఉండగా, 2019–24లో జగన్ పాలనలో 10వ స్థానానికి పడిపోయిందని తెలిపారు.
“చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీని నిర్మించలేదని జగన్ చెప్పడం పచ్చి అబద్ధం. చంద్రబాబు, ఎన్టీఆర్ పాలనల్లో ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో 28 మెడికల్ కాలేజీలు స్థాపించబడ్డాయి. ఆ కాలేజీలు ఇవాళ ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నాయి. చంద్రబాబు లక్ష్యం హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే” అని పల్లా లేఖలో పేర్కొన్నారు.
