అమెరికాలో కార్చిచ్చు పుట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేల ఎకరాలను బూడిద చేసేసింది. అత్యంత ఖరీదైన ఇండ్లను నేలమట్టం చేసింది. అమెరికాలోనే సంపన్నులు బతికే ఏరియాను నామరూపాల్లేకుండా చేస్తోంది ఆ కార్చిచ్చు. మన దేశంలో లాగానే అమెరికాలో కూడా ధనవంతులు బతికే నగరాలు కొన్ని ఉన్నాయి. అందులో లాస్ ఏంజెలెస్ కూడా ఒకటి. ఇక్కడ అత్యంత సంపన్నులు లగ్జరీ ఇండ్లను కట్టుకుని నివసిస్తున్నారు. కాగా ఈ విలాసవంతమైన నగరానికి ఇప్పుడు కార్చిచ్చు అంటుకుంది. లాస్ ఏంజెలెస్ లోని ది పాలిసాడ్స్ లో ఈ కార్చిచ్చు స్టార్ట్ అయింది. ఇప్పటికే 3వేల ఎకరాలు దగ్ధం అయ్యాయి.
30వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ప్రజలు తమ ఇండ్లు, కార్లు, డబ్బులు, వస్తువులను వదిలేసి ప్రాణాలను చేతిలో పట్టుకుని పరుగులు తీస్తున్నారు. ఈ ఒక్క నగరంలోనే ఇప్పటి వరకు 13వేల ఇండ్లు కాలిపోయాయి. ప్రజలంతా ఒక్కసారిగా ఇండ్ల నుంచి పరుగులు తీయడంతో రోడ్లు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయాయి. కొండ ప్రాంతంలో రోడ్లు కాస్త సన్నగా ఉంటాయి కాబట్టి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి. హాలీవుడ్ స్టార్లు కూడా ఈ కార్చిచ్చులో ఇండ్లను కోల్పోయారు. ఇక్కడ మంటలను ఆర్పేందుకు విమానాలు, హెలికాఫ్టర్లు, ఫైర్ ఇంజిన్లు చేరుకుంటున్నాయి.
ఈ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ కూడా స్పందించాడు. అధికారులతో ఎప్పటికప్పుడు అప్ డేట్లు తెలుసుకుంటున్నామని.. వైట్ హౌస్ అన్ని విధాలుగా సాయం చేస్తుందని ప్రకటించాడు. ప్రస్తుతం కార్చిచ్చు ఇంకా అదుపులోకి రాలేదు. భారీ ఎత్తున మంటలు వ్యాపిస్తుండటంతో దగ్గరకు కూడా వెళ్లలేకపోతున్నాయి ఫైర్ వాహనాలు. ప్రస్తుతం చాలా ప్రాంతాలకు కరెంట్ ఆగిపోయింది.