యుద్ధం వస్తే వినాశనమే.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, ఆ వినాశనాన్ని పదే పదే కోరుకుంటోంది పొరుగు దేశం పాకిస్తాన్. తమ దేశంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రి.. అందరిదీ ఒకటే మాట. భారతదేశంతో యుద్ధం చేయాల్సిందేనని తమ పౌరులకు పిలుపునిచ్చేశారు బాధ్యతారాహిత్యంతో. ‘మా దగ్గర అణ్వాయుధాలున్నాయ్..’ అని పదే పదే ప్రకటించుకోవడం పాకిస్తాన్‌కే చెల్లింది.
ప్రపంచంలో పలు దేశాల దగ్గర అణ్వాయుధాలున్నాయి.. ఏ దేశమూ తమ వద్ద అణ్వాయుధాలున్నాయని పదే పదే చెప్పుకోవు. ఆఖరికి కొరియన్ కొరివి దెయ్యం కూడా ఈ విషయంలో పాకిస్తాన్ కంటే బెటరేమో. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు ఈనాటివి కావు. ప్రత్యక్ష యుద్ధంలో పలుమార్లు చావు దెబ్బ తిన్న పాకిస్తాన్, భారతదేశంతో పూర్తిస్థాయి యుద్ధం చేసే శక్తి తమకు లేదని తెలుసుకుంది కాబట్టే.. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, ‘దురద’ తీర్చుకుంటోంది.
కానీ, అడపా దడపా పాకిస్తాన్‌కి భారత్ ఇచ్చే సమాధానం అంతకు మించిన స్థాయిలోనే వుంటోంది. గతంలో పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీసే విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయడంలో భారతదేశం. ఈ పరిస్థితి తెలిసీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్ మీద కవ్వింపు చర్యల కోసం తహతహలాడుతున్నాడు. తమ వద్ద అణ్వాయుధాలున్నాయంటున్నాడు. యుద్ధానికి వెనుకాడబోమంటున్నాడు.
భారత స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన భారత ప్రధాని, అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించారు. పాక్ కవ్వింపులకు అంతే స్థాయిలో తన ప్రసంగం ద్వారా సమాధానమిచ్చే అవకాశం వున్నా నరేంద్ర మాత్రం పూర్తిగా దేశ ప్రజలకు చెప్పాలనుకున్న విషయాల్ని మాత్రమే చెప్పారు. అదే భారతదేశానికీ, పాకిస్తాన్‌కీ వున్న తేడా.