nభారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ఆంధ్రప్రదేశ్ కు మరో ముప్పు పొంచి ఉంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో కృష్ణానదికి మరింత వరద పోటెత్తే ప్రమాదం ఉంది. ద్రోణీ ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద ప్రవాహం భారీగా కృష్ణానదిని చేరనుంది. దీంతోపాటు 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ అల్పపీడనం తుఫానుగా మారి విశాఖపట్నం, ఒడిశా మీదుగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఫలితంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో ఇది ఇప్పటికే వరద ముంపు కి గురైన లోతట్టు ప్రాంతాల ప్రజలకు మరింత ఆందోళన కలిగిస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తూర్పు విదర్భ, తెలంగాణ ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది