మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై మరోసారి కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసి, సోషల్ మీడియాలో కించపరిచే పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నానికి చెందిన అంజనాప్రియ అనే మహిళ 2024లోనే విశాఖ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు BNS 353(2), 352, 351(4), 196(1), 467 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతూ, విశాఖ త్రీటౌన్ పోలీసులు గుడివాడలో కొడాలి నానిని గుర్తించి నోటీసులు అందజేశారు. విచారణకు హాజరు కావాలని, దర్యాప్తులో సహకరించాలని ఆదేశించారు.
ఈ కేసు నమోదు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే కొడాలి నాని ఇప్పుడు ఈ కొత్త కేసుతో మళ్లీ ఫోకస్‌లోకి వచ్చారు. పోలీసుల ప్రకారం దర్యాప్తు పూర్తయ్యాకే తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయి.
