‘ఇంకొంచెం తిను నాన్నా..’ అంటూ చాలాకాలం క్రితం ఓ తెలుగు దినపత్రికలో వచ్చిన కార్టూన్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోందిప్పుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో తన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘దోచిపెట్టిన’ వైనానికి సంబంధించిన కార్టూన్ అది.
ఒకవేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి వుంటే, ఆయనే ‘అక్రమాస్తుల కేసు’లో ఏ1 నిందితుడిగా వుండి వుండేవారు. సరే, రాజకీయాల్లో అప్పటికే మంచి పవర్‌తో వున్న వైఎస్సార్, ఆ కేసు అసలు తెరమీదకు వచ్చి వుండేదే కాదన్నది ఇంకో వాదన. అది మళ్ళీ వేరే చర్చ.
ఇక, కాంగ్రెస్ పార్టీని వీడి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుని శివకుమార్ అనే వ్యక్తి నుంచి లాగేసుకుని, కొత్త రాజకీయ కుంపటి ప్రారంభించిన వైఎస్ జగన్, తన తండ్రి పేరు చెప్పుకుని, కొత్త రాజకీయ శక్తిగా ఎదిగారన్నది నిర్వివాదాంశం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదు.. అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.
ఈ విషయం చాలామంది సాధారణ ప్రజానీకానికి తెలియదు. వైఎస్సార్ పార్టీ.. అనే జనంలోకి తన పార్టీని తీసుకెళ్ళారు వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా. ముఖ్యమంత్రి అయ్యాక, పలు సంక్షేమ పథకాలకు వైఎస్సార్ పేరుని జోడించి, రాష్ట్రంలో ఎక్కడికక్కడ వైఎస్సార్ పేరు కనిపించేలా చేశారు. క్రమంగా, జగనన్న అనే బ్రాండ్‌ని బిల్డప్ చేసుకోగలిగారు.
కాలక్రమంలో వైఎస్సార్ పేరు కాస్త తెరమరుగవుతూ వచ్చింది. సొంత మీడియాలోనూ వైఎస్సార్ ప్రస్తావన తగ్గిపోయింది. ఇంకోపక్క, ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం పాలయ్యింది. దాంతో, మళ్ళీ వైఎస్సార్ భజన షురూ చేశారు జగన్ రెడ్డి.
వైఎస్సార్ గొప్పతనాన్ని కీర్తిస్తూ, వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్ నిత్యం పోస్టులు పెడుతూ వస్తోంది. ఇది కాస్త ఆసక్తికరమైన విషయమే. అయితే, వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్ చేస్తున్న వైఎస్సార్ అనుకూల ట్వీట్లకు, నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా వస్తున్నాయి. వాటిల్లో, ‘ఇంకొంచెం తిను నాన్నా’ కార్టూన్ విరివిగా దర్శనమిస్తోంది.