వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వేరే శతృవులు అక్కర్లేదు. ఇంట్లోంచే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శతృవు రాజకీయ తెరపై సందడి చేస్తున్నారు. ఆ శతృవు ఎవరో కాదు వైఎస్ షర్మిల.! ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైఎస్ జగన్ చేసిన ‘అతి’ మీద తొలుత కౌంటర్ ఎటాక్ ఇచ్చిందెవరో కాదు, స్వయానా ఆయన సోదరి వైఎస్ షర్మిల.
ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు వైఎస్ షర్మిల. దాంతో, ఆమె మాటకు విలువ కాస్త గట్టిగానే వుంటోంది. ‘హత్యా రాజకీయాలు చేసింది నువ్వు.. గొడ్డలి రాజకీయాలు చేసింది నువ్వు..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్లో వైఎస్ షర్మిల ఏకి పారేసిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పదకొండు సీట్లతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైసీపీనీ అసెంబ్లీకి పంపి తప్పు చేశాం, అదే కాంగ్రెస్ పార్టీకి ఆ సీట్లు ఇచ్చి వుంటే, వైఎస్ షర్మిల అసెంబ్లీలో హుందాగా ప్రవర్తించేవారు, బాధ్యతగా వ్యవహరించేవారు.. అన్న చర్చ రాష్ట్ర ప్రజల్లోనే కాదు, వైసీపీ శ్రేణుల్లోనూ జరిగే పరిస్థితి వచ్చేసింది.
ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత విభేదాల కారణంగా హత్య జరిగితే, దాన్ని రాజకీయ హత్యగా పేర్కొంటూ రాజకీయం చేయడమేంటి.? అని నిలదీసిన వైఎస్ షర్మిల, ‘సిగ్గు లేదా’ అన్న మాటనీ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ప్రయోగించేశారు మరి.!
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిల ‘పక్కలో బల్లెం’లా తయారయ్యారన్నది నిర్వివాదాంశం. షరామామూలుగానే వైసీపీ పెయిడ్ బ్యాచ్, షర్మిలని దుర్భాషలాడుతున్నారు సోషల్ మీడియా వేదికగా.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో వుంది. తెలంగాణలో అయితే అధికార పీఠమ్మీదుంది. ఎలా చూసినా, ప్రస్తుతానికి జగన్ కంటే రాజకీయంగా వైఎస్ షర్మిలే పవర్ఫుల్.! జగన్ గనుక ఇవే తప్పటడుగులు కొనసాగిస్తే, షర్మిల ముందు నువ్వెంత.? అని వైసీపీ నేతలే ముందు ముందు జగన్ ని నిలదీసే పరిస్థితి రావొచ్చు.