తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ కేసులో భాగంగా NTV ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్‌తో పాటు రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా అరెస్ట్ చూపకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఐదు రోజుల క్రితం NTVలో ప్రసారమైన ఈ వార్తపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో, నిన్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో న్యాయసలహాదారుల సూచన మేరకు నిన్న సాయంత్రం NTV యాజమాన్యం బహిరంగంగా క్షమాపణ కూడా కోరింది. దీంతో విషయం అక్కడితో ముగుస్తుందని చాలామంది భావించారు.
అయితే, అనూహ్యంగా ఘటన మరో మలుపు తిరిగింది. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న NTV ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్‌ను పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో మరో ఇద్దరు రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఎక్కడ ఉంచారన్న విషయాన్ని పోలీసులు స్పష్టంగా వెల్లడించకపోవడం మరింత అనుమానాలకు దారి తీస్తోంది.
ఇవాళ వీరిని నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేలా పోలీసులు ప్లాన్ చేస్తున్నారని ఛానల్ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై మీడియా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుండగా, జర్నలిస్టులపై తీసుకుంటున్న చర్యలు సముచితమా కాదా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం వాదిస్తుండగా, మరోవైపు ఇది మీడియాను భయపెట్టే ప్రయత్నమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసు ఎలా మలుపులు తిరుగుతుందో, న్యాయస్థానం ముందు ఏ నిర్ణయం వెలువడుతుందో చూడాల్సి ఉంది.
