అభిమానులపై జూనియర్ ఎన్టీఆర్ ఎంత బాధ్యతగా ఉంటారో తెలిసిందే. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన చెప్పిన మాటలు ఆయన ప్రతి సినిమాలోనూ ప్రదర్శిస్తూనే ఉంటారు. తాజాగా క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానిపై ఆయన చూపిన ఆప్యాయత నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తిరుపతికి చెందిన కౌశిక్ అనే 19 ఏళ్ల కుర్రాడు క్యాన్సర్ తో పోరాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈనెల 27న విడుదల అయ్యే ఎన్టీఆర్ సినిమా “దేవర” చూసేవరకైనా తనను బతికించాలని వేడుకున్న వీడియో రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన బిడ్డ కోరిక తీర్చాలంటూ కౌశిక్ తల్లిదండ్రులు మీడియా సమావేశంలో అభ్యర్థించారు. ఈ వీడియో బాగా వైరల్ అయి ఎన్టీఆర్ వరకు చేరింది. దీంతో ఆయన ఈరోజు కౌశిక్ కు వీడియో కాల్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు.
” కౌశిక్ మీరు ధైర్యంగా పోరాడి కోలుకుని బయటకు రావాలి. “దేవర” సినిమా చూడాలి. సినిమా తర్వాత.. ముందు మీరు కోలుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి” అని ఎన్టీఆర్ చెప్పగా.. “అన్నా మిమ్మల్ని చూస్తానని అస్సలు అనుకోలేదు.. ఒక్కసారి అయినా మిమ్మల్ని కలవాలి అని కౌశిక్ కోరగా.. ” నీతో మాట్లాడకుంటే ఎట్టా.. ముందు ధైర్యంగా ఉండు” అంటూ ఎన్టీఆర్ బదులిచ్చారు”. ఎన్టీఆర్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “దేవర పార్ట్ 1” ఈనెల 27న విడుదల కానుంది. జాన్వి కపూర్ కథానాయిక. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.