ది కింగ్ ఆఫ్ కంటెంట్ Sree Vishnu హీరోగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ ట్రైలర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ N. T. Rama Rao Jr. విడుదల చేశారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రం మార్చి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించగా, తాజాగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం ఎన్టీఆర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ నిర్మాత సందీప్ గుణ్ణంతో తన స్నేహాన్ని గుర్తుచేశారు. ప్రత్యేకమైన కథలను ఎంచుకునే దృష్టి అతనికి ఉందని, ‘మృత్యుంజయ్’ వంటి యూనిక్ స్క్రిప్ట్‌తో తొలి నిర్మాణంగా ముందుకు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ట్రైలర్‌లో కనిపిస్తున్న కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది. తండ్రిని కోల్పోయిన ఓ చిన్నారి భావోద్వేగంతో కథ ప్రారంభమవుతున్నట్టు చూపించారు. చివర్లో ఆ బాలుడి కథను హీరో పాత్రతో అనుసంధానం చేసిన తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. హీరోకి మాత్రమే కనిపించే ఓ హంతకుడు పోలీసులకు ఎందుకు కనిపించడంలేదన్న ప్రశ్న కథలో కీలకంగా నిలుస్తోంది. అసలు ఆ వ్యక్తి ఎవరు? నేరం ఎలా జరిగింది? ఈ మిస్టరీని హీరో ఎలా ఛేదిస్తాడు? అనే అంశాలు ప్రేక్షకుల్లో ఉత్సుకత పెంచుతున్నాయి.
‘సామజవరగమన’తో హిట్ జంటగా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రంలో మరోసారి జంటగా కనిపించనున్నారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కాళ భైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మరింత థ్రిల్‌ను జోడించింది. సినిమాటోగ్రఫీని ని విద్యా సాగర్ నిర్వహించగా, ఎడిటింగ్ బాధ్యతలను శ్రీకర్ ప్రసాద్ చేపట్టారు. ప్రొడక్షన్ డిజైన్‌ను మనీషా ఎ. దత్ రూపొందించారు.
ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ‘మృత్యుంజయ్’ మార్చి 6న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తే ఈ చిత్రం సమ్మర్ సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశముంది.
