19 ఏళ్ల యువకుడు క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. రోజు రోజుకు మరణానికి దగ్గరవుతున్నాడు. జీవితపు చివరి రోజుల్లో ఉన్న ఆ యువకుడికి తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమా “దేవర” చూడాలన్న ఆశ కలిగింది. అదే కోరికను తన తల్లిదండ్రుల ముందు బయట పెట్టాడు తిరుపతికి చెందిన కౌశిక్. బోన్ మారో క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్, బెంగళూరులోని కిడ్ వై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
చికిత్సకు రూ. 60 లక్షల కు పైగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అయితే తాను ఇక బతకనని తెలిసి తన అభిమాన హీరో సినిమా ఆఖరి సారిగా చూడాలని ఉందన్న విషయం తన తల్లిదండ్రులు శ్రీనివాసులు, సరస్వతి లకు చెప్పాడు. సెప్టెంబర్ 27న ఆ సినిమా విడుదల కానుండగా.. అప్పటి వరకైనా తనను బతికించాలని వేడుకున్నాడు.
తన బిడ్డ ఆఖరి కోరికను తీర్చమంటూ శ్రీనివాసులు తిరుపతిలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో వేడుకున్నారు. తన బిడ్డ ప్రాణాలను నిలబెట్టడానికి దాతలు సాయం చేయాలని కోరారు. సాయం చేయడానికి ముందుకు వచ్చేవారు 9490829381, 7995665169 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.