యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అనే పేరు ఆయన అభిమానులకు పూనకాలు తెప్పిస్తే.. తెలుగు సినీ పరిశ్రమకు కూడా జోష్ వస్తుంది. సినిమాల్లో రెండు దశాబ్దాలకు పైగా పూర్తి చేసుకున్న ఆయన ప్రయాణంలో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. ప్రస్తుత జనరేషన్ లో తెలుగు సినిమాకు ఖ్యాతి తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. చేసే పాత్ర ఏదైనా జీవించడం ఆయన రక్తంలోనే ఉందని చెప్పాలి. నందమూరి ఇంటి వారసుడిగా.. తెలుగు సినీ ప్రస్థానంలో ఆ ఇంటి పేరుకు ఉన్న పేరు ప్రఖ్యాతులను ఘనంగా నిలబెడుతున్న ఎన్టీఆర్ జన్మదినం నేడు.
తాత ఎన్టీఆర్ కు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన శ్రీరాముడి పాత్రలో బాలరామాయణంలో నటించి తన వారసత్వాన్ని 25 ఏళ్ల క్రితమే ఘనంగా చాటాడు. చిన్న వయసులోనే హీరోగా మారి రెండో సినిమా ఆదితోనే భారీ హిట్ ను సాధించి టాలీవుడ్ లో తన పేరు మోగిపోయేలా చేశాడు. తన ఫెరోషియస్ నటనతో ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్నాడు. తాత వర్ఛస్సు, తేజం పుణికిపుచ్చుకున్న ఈ ఎన్టీఆర్ ను ప్రేక్షకులు ఆరాధించారు. సింహాద్రి బ్లాక్ బస్టర్ తో అభిమానులను పెంచుకున్నాడు.
స్టార్ డైరక్టర్లు, నిర్మాతలు, రచయితలు తన కోసం వెయిట్ చేసే రేంజ్ సంపాదించుకోవడం పోటీ ఎక్కువగా ఉండే పరిశ్రమలో అంత తేలికైన విషయం కాదు. ఫ్లాపులు ఎదురైనా తట్టుకున్నాడు. అభిమానుల బలమే ఆలంబనగా సినిమాలు చేస్తూ హిట్లు అందుకున్నాడు. టెంపర్ కు ముందు వరుస ఫ్లాపులు.. టెంపర్ తర్వాత వరుస హిట్లతో తన స్టామినా నిరూపించుకున్నాడు. ఇటివల విడుదలైన ఆర్ఆర్ఆర్ లో కొమరం భీమ్ పాత్రలో ఒదిగిపోయి సినిమా ఘన విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ప్రస్తుతం తన 30వ సినిమా కొరటాల శివతో చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన టీజర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపితే.. పరిశ్రమలో అంచనాలు పెంచుతోంది. వెంటనే ప్రశాంత్ నీల్ తో మరో సినిమాతో ఇకపై తన దృష్టి పాన్ ఇండియా అని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ మరిన్ని విజయాలు సాధించి అభిమానులను ఉర్రూతలూగిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ.. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని కోరుకుంటూ.. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తోంది.. తెలుగు బులెటిన్.