ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పరిపాలన ఎలా ఉంటుందో తెలిసిందే. చిత్ర విచిత్రమైన ఆంక్షలు ఆ దేశంలో ఉంటాయి. ప్రపంచ దేశాలన్నీ ఆధ్యాధునిక సాంకేతికతను ప్రజలకు అందుబాటులో ఉంచుతూ దూసుకుపోతుంటే కిమ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటాడు. తన నిర్ణయాలను వ్యతిరేకించిన వారిని ఊచకోత కోయిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి సాధారణ ప్రజలకే కాకుండా తమ సైన్యానికి కూడా ఇంటర్నెట్ అలవాటు లేకుండా చేశాడు.
ఉక్రెయిన్ తో యుద్ధం కోసం రష్యా కు ఆయుధ సరఫరాతో పాటు ఇటీవల కిమ్ తమ సైన్యాన్ని కూడా సాయంగా పంపాడు. రష్యా కు మద్దతుగా ఆ దేశ సైన్యంతో కలిసి పోరాడే క్రమంలో ఉత్తరకొరియా సైన్యానికి కూడా కొత్తగా అపరిమిత ఇంటర్నెట్ సదుపాయం లభించింది. దీంతో విచ్చలవిడిగా అశ్లీల చిత్రాలు చూడటానికి ఉత్తరకొరియా సైన్యం అలవాటు పడిందని ఇంటర్నేషనల్ మీడియా ఓ కథనంలో రాసుకొచ్చింది. ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకునే సమయంలో కిమ్ సైన్యానికి రష్యా సైన్యం ఇంటర్నెట్ అలవాటు చేసినట్లు ఆ న్యూస్ లో పేర్కొంది. ఇంతకుముందు ఎన్నడూ కిమ్ సైన్యానికి ఇంటర్నెట్ అలవాటు లేకపోవడంతో దొరికిందే తడవుగా పోర్న్ చూడటానికి బానిసలు అయినట్లు బ్రిటన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
రష్యా కోసం కిమ్ 11 వేల మందికి పైగా తమ సైన్యాన్ని ఉక్రెయిన్ మీద యుద్ధానికి పంపాడు. ఆ సైన్యం అంతటికీ తూర్పు రష్యా ప్రాంతంలో శిక్షణ కూడా ఇచ్చినట్లు ఉక్రెయిన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని దక్షిణ కొరియాతోపాటు “నాటో” కూడా ప్రస్తావించింది. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న ఉత్తరకొరియా సైన్యం నవంబర్ మొదటివారం నుంచే యుద్ధ రంగంలోకి దిగినట్లు బ్రిటన్ మీడియా తెలిపింది.