మూడు రాజధానుల ఆలోచన వెనుక రాజకీయం సుస్పష్టం. మూడు ప్రాంతాల్లో రాజకీయ అలజడులు సృష్టించడం, తద్వారా రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేసుకోవడం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. లేకపోతే, దేశంలో ఎక్కడా లేని మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని ఆర్థికంగా నానా ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలనుకోవడమేంటి.?
ఆర్థికంగా అత్యున్నత స్థానంలో వున్న రాష్ట్రాలు ఇలాంటి ఆలోచన చేస్తే దాన్ని తప్పు పట్టలేం. ఒకే ఒక్క రాజధానిని నిర్మించుకోలేని ఆర్థిక దుస్థితి ఆంధ్రప్రదేశ్‌ది. ఈ పరిస్థితుల్లో మూడు రాజధానుల ఆలోచన అత్యంత ప్రమాదకరమైనదేనని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నా జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు.
ఇదిలా వుంటే, జగన్ వ్యూహానికి జనసేనాని కర్నూలు పర్యటనతో పెద్ద దెబ్బ తగిలినట్లే కన్పిస్తోంది. మూడు రాజధానుల ఎఫెక్ట్, జనసేనాని కర్నూలు పర్యటనపై ఎక్కడా పడలేదు. ఓ పది మంది గుమికూడి, ‘పెయిడ్ రచ్చ’ అయితే జనసేనానికి వ్యతిరేకంగా చేయగలిగారుగానీ.. వారి ‘గోల’, జనసైన్యం హోరు ముందు ఎక్కడా విన్పించలేదు.
ఇక, కర్నూలులో స్థానికంగా వున్న సమస్యల్ని జనసేనాని ప్రస్తావించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏళ్ళ తరబడి నిర్మాణానికి నోచుకోని ఓ బ్రిడ్జి, ఆ బ్రిడ్జి నిర్మాణానికి అడ్డు తగులుతున్న రాజకీయ వివాదాలు.. వీటన్నిటినీ ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పర్యటనలో ఎలుగెత్తి చాటారు. ‘ముందు, ఈ సమస్యల్ని పరిష్కరించండి.. ఆ తర్వాత మూడు కాదు, 30 రాజధానులు కడతామని చెప్పండి..’ అంటూ జనసేనాని ఎద్దేవా చేస్తున్నారు.
నిజమే, ఎప్పుడైతే ప్రజల సమస్యల్ని ఏ నాయకుడైనా ప్రస్తావిస్తాడో.. అప్పుడు, ఆటోమేటిక్‌గా ఆయా అంశాల చుట్టూ చర్చ జరిగి తీరుతుంది. కర్నూలు ఒకప్పుడు రాజధాని కావాల్సిన నగరమే. కానీ, కాలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ కర్నూలు అభివృద్ధి చెందలేదు. చంద్రబాబు హయాంలోనూ అదే పరిస్థితి. వైసీపీ అధికారంలోకి వచ్చి 8 నెలలకుపైగానే అవుతోంది. కర్నూలు అభివృద్ధికి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి.?
రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధాని సరిపోతుంది. మిగతా నగరాలన్నిటినీ రాజధాని తరహాలో అభివృద్ధి చేస్తే చాలు. కానీ, అది చేతకాక.. ప్రజల్ని రెచ్చగొట్టే క్రమంలో, రాజకీయ పబ్బం గడుపుకోవడానికే వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ వాస్తవం, జనసేనాని ‘సీమ’ పర్యటనతో మరోమారు బలంగా బయటకొచ్చింది. ఈ దెబ్బ అధికార వైఎస్సార్సీపీకి గట్టిగానే తగిలినట్లుంది. అందుకే, పార్టీ నేతలంతా మూకుమ్మడిగా జనసేనానిపై నోరు పారేసుకునేందుకు అత్యుత్సాహం చూపుతున్నారు తప్ప.. కర్నూలు సమస్యలపైనా, సీమ సమస్యలపైనా ఎవరికీ గొంతు పెగలడంలేదు.
