కాకినాడ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి కాకినాడ జిల్లా, ముఖ్యంగా కాకినాడ మరియు పిఠాపురం నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటానని ఆయన వెల్లడించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్రప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్‌లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి కావాలని, డొంక రోడ్లు, మౌలిక వసతులు, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికి తాగునీరు చేరేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడా నీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జిల్లా పరిధిలోని రోడ్ల పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ఏ ఒక్క రోడ్డుపై కూడా గుంత కనిపించకూడదు” అని స్పష్టంగా చెప్పారు. పూర్తిగా దెబ్బతిన్న రోడ్లకు కొత్త నిర్మాణాలు, చిన్న గుంతలకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని పేర్కొన్నారు.
అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల నాణ్యత, పారిశుధ్య నిర్వహణ, గ్రామ స్థాయిలో పార్కుల అభివృద్ధి, పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలపై కూడా సమీక్షించాలని అధికారులకు సూచించారు. యువతకు క్రీడలు, కళలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని, గ్రంథాలయాలను బలోపేతం చేయాలని తెలిపారు. యువతలో ఉన్న ప్రతిభ, కొత్త ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించే విధంగా పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాకినాడ తీరప్రాంతం వెంబడి చేపట్టనున్న గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును వర్షాకాలానికి ముందే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అటవీ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మరోవైపు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, రేషన్ మాఫియాను అరికట్టేందుకు పోలీసు శాఖ ఉక్కుపాదం మోపాలని ఎస్పీకి సూచించారు.
కాకినాడ జిల్లా అభివృద్ధి, మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ చూపిస్తున్న చొరవ జిల్లా రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

