జగనన్న షిక్కీ.. జగనన్న గోరుముద్ద.. జగనన్న మట్టి.. జగనన్న మశానం.. ఇదీ వైసీపీ హయాంలో నడిచిన వ్యవహారం.. ఇప్పుడవన్నీ లేవు.. అంటూ ఆంధ్ర ప్రదేశ్‌లో సంక్షేమ పథకాల లబ్దిదారులు, అందునా విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అన్ని సంక్షేమ పథకాలకీ వైఎస్సార్ పేరుగానీ, తన పేరునిగానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టుకోవడం చూశాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇందిర, రాజీవ్ పేర్లతో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెడితే, వైఎస్ జగన్ హయాంలో వైఎస్సార్, జగన్ పేర్లతో సంక్షేమ పథకాలు నడిచాయి.
గతంలో చంద్రబాబు హయాంలోనూ చంద్రబాబు, ఎన్టీయార్ పేర్లతో సంక్షేమ పథకాలు నడిచిన మాట వాస్తవం. ఇప్పుడూ చంద్రబాబు పేరుతో, ఎన్టీయార్ పేరుతో కొన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.
‘మేం అధికారంలోకి వచ్చినా, నా పేరుతో ఎలాంటి సంక్షేమ పథకాలూ వుండవ్..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. మాటకు కట్టుబడి వున్నారాయన. డిప్యూటీ సీఎం హోదాలో, పవన్ కళ్యాణ్ తనకున్న పవర్‌ని ఉపయోగించి, కొన్ని సంక్షేమ పథకాలకైనా తన పేరు వచ్చేలా చూసుకోగలరు.
కానీ, పవన్ కళ్యాణ్ అలా చేయడంలేదు. పైగా, డొక్కా సీతమ్మ.. తదితర మహనీయుల పేర్లను సంక్షేమ పథకాలకు పెట్టేలా పవన్ కళ్యాణ్ చర్లు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో తనదైన ముద్ర వేస్తున్నారు పవన్ కళ్యాణ్.
విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలు వంటి వాటిపై ఎక్కడా పార్టీల రంగులుగానీ, ప్రభుత్వంలో వున్నవారి పేర్లుగానీ లేకుండా చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ ఇటీవల ప్రకటించారు. అలా పేర్లే లేకపోవడం వెనుక అసలు కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
మిత్రపక్షం జనసేన సూచనల్ని, సలహాల్ని పరిగణనలోకి తీసుకుంటున్న టీడీపీని సైతం ఈ విషయంలో అభినందించి తీరాలి. సంక్షేమ పథకాలంటే ప్రజాధనంతో జరిగేవి. ఏ రాజకీయ నాయకుడూ జేబులోంచి తీసి ఇవ్వడు.
కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్, తన జేబులోంచి సొమ్ములు తీసి మరీ, ప్రజోపయోగ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు.. అదీ డిప్యూటీ సీఎం పదవిలో వుండి కూడా. అయినా, తన పేరుతో పబ్లిసిటీ స్టంట్లు నడవకుండా జాగ్రత్త పడుతున్నారు.
వైసీపీ పాలనలో, ఆ జగనన్న పేరుతో సంక్షేమ పథకాలను భరించలేకపోయాం.. విద్యార్థుల విషయంలోనూ పబ్లిసిటీ కక్కుర్తి ప్రదర్శించారు.. ఇప్పుడిలా పథకాలకు నాయకుల పేర్లు లేకపోవడం పూర్తిగా పవన్ కళ్యాణ్ ఘనతే.. అని సంక్షేమ పథకాల లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.