కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారం సమీపంలో అదృశ్యమైన చిన్నారి జాను కేసులో దర్యాప్తు అన్ని కోణాల్లో కొనసాగుతోందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినప్పటికీ చిన్నారిని ఎవరైనా తీసుకెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని ఆయన వెల్లడించారు. దీంతో అడవి జంతువులు చిన్నారిని లాక్కెళ్లి ఉండవచ్చనే అనుమానంతో పాటు ఇతర అవకాశాలపై కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
మీడియాతో మాట్లాడిన ఎస్పీ, ఇప్పటివరకు ఏ ఒక్క కోణంలోనూ స్పష్టమైన ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. చిన్నారి అదృశ్యమైన ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ఏడు మొబైల్ టవర్ల పరిధిలో నమోదైన సుమారు 4,800 ఫోన్ కాల్స్‌ను విశ్లేషించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో కొందరు అనుమానితులను గుర్తించినప్పటికీ, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నారు.
చిన్నారి అదృశ్యమైన రోజు వర్షం కురిసిందని, కొండ ప్రాంతాల్లో వర్షపు నీటి ప్రవాహం తీవ్రంగా ఉంటుందని ఎస్పీ వివరించారు. ఆ పరిస్థితుల్లో చిన్నారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండవచ్చనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఇదిలా ఉండగా, జానుతో పాటు అడవిలోకి వెళ్లి తిరిగి వచ్చిన కుక్క మృతి చెందడంతో దానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. కుక్క శరీరం నుంచి సేకరించిన నమూనాలను విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. ఆ నివేదికలు దర్యాప్తుకు ఉపయోగపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అదనంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. థర్మల్ డ్రోన్ల సహాయంతో అడవి ప్రాంతాలను జల్లెడ పడుతూ గాలింపు చర్యలను మరింత విస్తరించారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, అటవీ శాఖ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
