తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, సోదాల కారణంగా. సీబీఐ, ఈడీ, ఐటీ.. ఇలా వివిధ శాఖలు.. అధికార పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నాయన్న విమర్శలున్నాయి. ఉత్త విమర్శలు కావు, వివిధ వ్యవహారాలకు సంబంధించి ఆయా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి.. మంత్రులపైనా ‘ఎటాక్స్’ జరుగుతున్నాయ్.. సోదాల్లో పెద్దయెత్తున డబ్బు పట్టుబడినట్లుగా తేల్చుతున్నాయి.
బీజేపీ మార్కు రాజకీయమిది.! ఔను, దేశవ్యాప్తంగా కేవలం విపక్షాల మీద, తమకు రాజకీయంగా ఎవరు అడ్డంకి అనుకుంటే వాళ్ళ మీద సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల్ని అలాగే ఐటీ శాఖను ఉసిగొల్పడం కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకి అలవాటేనన్న విమర్శ వుంది. తమిళనాడు, కర్నాటక, పశ్చిమబెంగాల్.. ఇలా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ నిర్వాకాల గురించి కొత్తగా చెప్పేదేముంది.?
ఇప్పుడు తెలంగాణలోనూ అదే మార్కు రాజకీయం జరుగుతోంది. నో డౌట్, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిందే. కానీ, తమకు గిట్టని అక్రమార్కుల మీదనే బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగిస్తోంది.. అదే అసలు సమస్య. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పక్షంపై ఎందుకు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరగడంలేదు.? అన్న ప్రశ్నకు.. సమాధానమెవరిస్తారు.?
అబ్బే, ఏపీలోని అధికార పార్టీ నాయకులంతా సుద్దపూసలే.. అందుకే, అక్కడ సీబీఐ, ఈడీ, ఐటీ వంటివాటికి పెద్దగా పనిలేదని అనుకోవాలేమో.!
‘ఏపీలో అధికార వైసీపీ, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి సరెండర్ అయిపోయింది. ప్రత్యేక హోదా అడగడంలేదు, పోలవరం ప్రాజెక్టు గురించి నిలదీయడంలేదు.. అలాంటప్పుడు, అక్కడెందుకు దర్యాప్తు సంస్థలు సందడి చేస్తాయ్.?’ అని గులాబీ పార్టీకి చెందిన కొందరు నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
అంతేనా, అదే నిజమనుకోవాలా.? అంతేనేమో.!