అడిగిన మేరకు సినిమా టిక్కెట్ల ధరల పెంపుదలకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినప్పుడు.. బెనిఫిట్ షోలకూ వెసులుబాటు కల్పించినప్పుడు, ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా.?
‘ఇది పుష్పగాడి రూలు’ అని సినిమాలో డైలాగులు చెప్పినట్లుండదు వ్యవహారం.! బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.! చివరి నిమిషంలో థియేటర్‌లో సినిమా చూడాలన్న అల్లు అర్జున్ వ్యూహం బెడిసికొట్టింది. ఓ అభిమాని ప్రాణాన్ని తీసింది. ఓ చిన్నారి ఆసుపత్రిపాలయ్యేలా చేసింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రీమియర్ షోని చూసేందుకు అల్లు అర్జున్ రావడంతో, జరిగిన తొక్కిసలాటపై పోలీసులు సైతం గుస్సా అయ్యారు. కేసు నమోదవడం, అల్లు అర్జున్‌పైనా వివిధ సెక్షన్లు పెట్టడం.. తెలిసిన విషయాలే.
ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వమూ సీరియస్ అయ్యింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఘటనపై స్పందించారు. బాధ్యతగా వుండాల్సిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమా బృందం బాధ్యతారహితంగా వ్యవహరించిందన్నారాయన. ఇకపై, తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతివ్వబోమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించిన ఈ నిర్ణయం, సంక్రాంతి సినిమాలపై ప్రభావం చూపనుంది. ఈ సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహరాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలకు ‘పుష్పగాడి దెబ్బ’ చాలా గట్టిగా పడిందనీ, ఈ దెబ్బ మొత్తం సినీ పరిశ్రమకి కూడా అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.
బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల సందర్భంగా ఆయా సినీ నటులు, ఆయా సినిమాల్ని థియేటర్లలో చూడటం కొత్తేమీ కాదుగానీ, ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం అనేది ఇక్కడ పెద్ద తప్పుగా కనిపిస్తోంది.