నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, వెండితెరపై హీరోయిన్‌గా ప్రయత్నించి పరాజయాల్ని మూటగట్టుకున్న విషయం విదితమే. ప్రస్తుతం చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాపైనే చాలా ఆశలు పెట్టుకుంది నిహారిక. ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో కన్పించబోతోంది. అన్నట్టు, నిహారిక తమిళంలో కూడా ఓ సినిమా చేసిందండోయ్. కానీ, అక్కడా ఆమెకు తగిన గుర్తింపు రాలేదనుకోండి.. అది వేరే సంగతి.
బుల్లితెరపై హోస్ట్‌గా ఓ సక్సెస్‌ఫుల్ షోని నడిపిన నిహారిక, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై వెబ్‌సిరీస్‌లతో మాత్రం తనదైన గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా, నిహారిక నుంచి మరో వెబ్ సిరీస్ రెడీ అవుతోంది. అదే ‘మ్యాడ్ హౌస్’. ఒకటి కాదు, రెండు కాదు.. పదీ కాదు, పాతికా కాదు.. ఏకంగా 100 ఎపిసోడ్స్‌తో కూడిన వెబ్ సిరీస్ ఇది. ఏకంగా ఏడాదిన్నరపాటు ఈ వెబ్‌సిరీస్ కొనసాగుతుందట.
Also Read: వెబ్ సిరీస్ తో హీటెక్కిస్తానంటున్న రష్మీ ?
ఏదో డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద డబ్బులు ఖర్చు చేసి చూసే వ్యవహారం కాదిది. ఉచితంగానే వీక్షించే అవకాశం వుంది అందరికీ. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ యూ ట్యూబ్ ఛానెల్‌లో ఈ వెబ్ సిరీస్‌ని వీక్షించవచ్చు. ఈ విషయాలన్నిటినీ నిహారిక సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేస్తూ చెప్పింది.
వెబ్ సిరీస్‌లలోనూ, సినిమాల్లోనూ బుల్లితెరపైనా తనను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ‘మ్యాడ్‌హౌస్’ని కూడా విజయవంతం చేస్తారని ఆకాంక్షిస్తోంది నిహారిక కొణిదెల. ఇదిలా వుంటే, నిహారిక ప్రధాన పాత్రలో ఓ సినిమా నిర్మించేందుకు నాగబాబు సన్నాహాలు చేస్తున్నారంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు విన్పిస్తోన్న విషయం విదితమే. మరోపక్క నిహారిక పెళ్ళి.. అంటూ పుకార్లకు కొదవే లేదు. ఆ వ్యవహారాల సంగతెలా వున్నా, నిహారిక ‘మ్యాడ్ హౌస్’ మాత్రం, అప్పుడే హాట్ టాపిక్‌గా మారుతోంది.
