ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణాల కోసం ప్రభుత్వం కొత్త హెలికాప్టర్‌ను వినియోగంలోకి తెచ్చింది. ఇప్పటి వరకు వాడిన బెల్ కంపెనీ హెలికాప్టర్ తరచూ సాంకేతిక లోపాలు రావడంతో, భద్రతా కారణాల దృష్ట్యా మరో హెలికాప్టర్‌ను అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు.
గతంలో బెల్ హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి పర్యటనల సమయంలోనే కాకుండా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటనలో కూడా సమస్యలు వచ్చాయి. దీంతో భద్రతా వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించి, హెలికాప్టర్ మార్చాలని ప్రభుత్వానికి సూచించాయి.
కొత్తగా అద్దెకు తీసుకున్న ఎయిర్‌బస్ హెచ్-160 హెలికాప్టర్ ఆధునిక సదుపాయాలతో పాటు సుదూర ప్రాంతాలకు నేరుగా ప్రయాణం చేయగలదు. ఇకపై అమరావతి నుంచే నేరుగా శ్రీకాకుళం, చిత్తూరు, విశాఖ, కడప, కర్నూలు జిల్లాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీని వల్ల ప్రయాణ వ్యయం 70 శాతం వరకు తగ్గనుంది. సమయం కూడా గణనీయంగా ఆదా అవుతుంది.
ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేసిందన్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. పూర్తిగా అద్దె ప్రాతిపదికన మాత్రమే హెలికాప్టర్ మార్పు జరిగిందని స్పష్టం చేసింది. ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి, భద్రత, సౌకర్యం, ఖర్చు ఆదా— చూసి సీఎం చంద్రబాబు, ఇతర విఐపీల పర్యటనల కోసం ప్రభుత్వం ఎయిర్‌బస్ హెచ్-160 హెలికాప్టర్ ను వినియోగిస్తోంది.
