ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల పునర్విభజన అంశంలో భౌగోళికంగా అన్ని పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పాలనా వికేంద్రీకరణకు అనువుగా ఉండేలా జిల్లాల విభజన చేపట్టామని ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రకారం 25 కాకుండా భౌగోళికంగా పెద్దదైన పాడేరు ప్రాంతాన్ని రెండు జిల్లాలగా విభజించి 26 జిల్లాలు చేయాలని సూచించాం. జిల్లా కేంద్రం దగ్గరగా , పరిపాలనా సౌలభ్యం, ఆర్ధిక వసతులు, పరిస్ధితులు, వనరులను పరిగణనలోకి తీసుకుని జిల్లాలను విభజించాం. ప్రతీ జిల్లాలో రెండు లేదా మూడు రెవెన్యూ డివిజన్ లు, ప్రజలకు దగ్గరగా ఉండేలా చూశాం. జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాన్ని విభజించకుండా ఆ జిల్లాలలోనే పూర్తిగా ఉండేలా చూశాం.
శ్రీకాకుళం పేరుతో ఏర్పడిన అన్ని సంస్ధలు ఎచ్చెర్ల లోనే ఉన్నాయి…ఇది తీసేస్తే శ్రీకాకుళం సమతుల్యత దెబ్బతింటుందని ఎనిమిదో నియోజకవర్గమైనా కూడా శ్రీకాకుళంలో కలిపాం. * విశాఖ పార్లమెంట్ లోని ఎస్.కోటను విజయనగరంలో కలిపి ఏడు నియోజకవర్గాలుగా ఉంచాం. పార్వతీపురంలోని నాలుగు నియోజకవర్గంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలని కలిపి ఒక జిల్లాగా.. .పాడేరులోని మూడు నియోజకవర్గంలో ఒక జిల్లాగా రెండు గిరిజన జిల్లాలని ఏర్పాటు చేశాం. బాపట్లకి రెవెన్యూ డివిజన్లు రాకపోవడంతో కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు ప్రతిపాదించాం. అనంతపురం జిల్లాని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటు చేశాం. గుంతకల్ లో కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశాం.
కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 23 లక్షల జనాభా ఉంటే.. మిగిలిన జిల్లాల్లో సరాసరి 20 లక్షల జనాభా ఉంది. 26 జిల్లాలు…62 రెవెన్యూ డివిజన్లగా వచ్చాయి. కొత్తగా 15 రెవెన్యూ డివిజన్లు ప్రతిపాదించాం. ఫిబ్రవరి 26 వరకు ప్రజలు, వివిధ సంఘాల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకుంటాం. ఉగాది నుంచి కొత్త జిల్లాల పాలన ప్రారంభించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఉద్యోగుల విభజన, కొత్తగా ఉద్యోగాల కల్పనపై సబ్ కమిటీ పరిశీలిస్తుంది. ప్రతీ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్, జిల్లా కోర్టులు ఉంటాయి.